SUNITHA PATNAM : మల్కాజ్ గిరికి స్పెషల్ మేనిఫెస్టో.. సమస్యల పరిష్కారంపై సునీత ఫోకస్

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోతో పాటు... మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక మేనిఫెస్టో రెడీ అయింది.

 

 

 

జాతీయ స్థాయిలో కాంగ్రెస్ విడుదల చేసిన మేనిఫెస్టోతో పాటు… మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సమస్యల పరిష్కారానికి ప్రత్యేక మేనిఫెస్టో రెడీ అయింది. ఈ లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న పట్నం సునీత మహేందర్ రెడ్డి… స్థానిక సమస్యలే ఎజెండాగా మేనిఫెస్టోని రూపొందించారు. విద్యా, వైద్యం, పారిశుధ్యం, వ్యర్థాల తొలగింపు, నీటి వసతి, పర్యావరణ పరిరక్షణ, నియోజకవర్గంలో మౌలిక సదుపాయాలు, ఉపాధి, పరిశ్రమల స్థాపన, మహిళలు, ఇతర వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ఈ మేనిఫెస్టో తయారు చేశారు.

మాల్కాజ్ గిరి నియోజకవర్గ పరిధిలో విద్యా వైద్యానికి ప్రియారిటీ ఇస్తామంటున్నారు కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి. నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీలను అభివృద్ధి చేయడంతో పాటు JEE, NEET, క్లాట్ లాంటి పరీక్షల ప్రిపరేషన్ కు కోచింగ్ ఇప్పిస్తామని వాగ్దానం చేస్తున్నారు. ప్రతి డివిజన్ లో స్మార్ట్ హైస్కూల్ ఏర్పాటుకు కృషి చేయడం, బస్తీల్లో అంగన్వాడీల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తారు. అలాగే ప్రతి వార్డు, డివిజన్ లో PHCలను ఏర్పాటు చేయడం, పారిశ్రామిక ప్రాంతాల్లో హెల్త్ క్యాంపులను నిర్వహిస్తామంటున్నారు సునీతా మహేందర్ రెడ్డి.

మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో ఎక్కువగా సిటీ విస్తరించి ఉంది. అందుకే డ్రైనేజీలను ఎప్పటికప్పుడు క్లీన్ చేయించడంతో పాటు… అవసరైన చోట కొత్తగా మురికి కాలువలను నిర్మిస్తామని మేనిఫెస్టోలో తెలిపారు పట్నం సునీతా రెడ్డి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ను అభివృద్ధి చేయడం, మురుగునీటి శుద్ధి ప్లాంట్స్ నిర్మాణం, సిటీలో ఇబ్బందిగా తయారైన డంప్ యార్డులను బయటకు తరలిస్తామంటున్నారు.

పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చెరువులు, నీటి కుంటలను అభివృద్ధి చేసి… వాటి చుట్టూ పార్కులను నిర్మిస్తామని మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి హామీ ఇస్తున్నారు. సిటీలో కాలుష్యం పెరిగిపోతుండటంతో… దాని నివారణకు గ్రీన్ ఇండస్ట్రీలను ఏర్పాటు చేయడంతో పాటు… కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలను సిటీ బయటకు తరలిస్తామని చెబుతున్నారు పట్నం సునీత.

మల్కాజ్ గిరి పరిధిలో ట్రాఫిక్ సమస్య ఎక్కువ. అందుకే రోడ్ల రిపేర్లు, విస్తరణతో పాటు లింకు రోడ్లను అభివృద్ధి చేయడం, అండర్ పాస్ లు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీత. అలాగే వర్షాకాలంలో వరద నీరు కాలనీలను ముంచెత్తుతుంది. ఆ ఏరియాల్లో డ్రైయిన్లు ఏర్పాటు చేయిస్తామంటున్నారు. మల్కాజ్ గిరి నియోజకవర్గం పరిధిలోని ఉపాధి, పరిశ్రమల స్థాపనకు ప్రియారిటీ ఇస్తామన్నారు సునీత మహేందర్ రెడ్డి. ఉపాధి కల్పించే ITI లను కుత్భుల్లాపూర్, ఉప్పల్ ఏరియాల్లో స్థాపిస్తామన్నారు. అలాగే LB నగర్, ఉప్పల్ లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేస్తామని మేనిఫెస్టో ద్వారా హామీ ఇస్తున్నారు సునీతా మహేందర్ రెడ్డి.

మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో చిరు వ్యాపారుల కోసం, చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటున్నారు. ప్రతి డివిజన్ లో మహిళలు, పిల్లల కోసం అమ్యూజ్ మెంట్ పార్కులు, స్పోర్ట్స్ క్లబ్స్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు సునీతా మహేందర్ రెడ్డి. మధ్యతరగతి, పేదల ఇళ్ళల్లో ఫంక్షన్లు, ఇతర అవసరాల కోసం డివిజన్లలో చిన్న చిన్న ఫంక్షన్ హాళ్ళు కట్టిస్తామని మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి హామీ ఇచ్చారు. నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను జనంలోకి తీసుకెళ్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.