ఈమధ్య కాలంలో వినోదాలు తీవ్ర విచారాలు, విషాదాలుగా మారుతున్నాయి. ఇలాంటివి మన రాష్ట్రంలో, మన దేశంలోనే కాదు. విదేశాల్లో కూడా తరచూ చోటు చేసుకుంటున్నాయి. కేవలం 5 నెలల వ్యవధిలో ఇద్దరు ఇలాంటి సరదా పందేల్లో పాల్గొని ప్రాణాలు విడిచారు. అదేదో పైశాచిక ఆనందం కోసం చేసే ప్రయోగాలు ప్రాణాల మీదకు వస్తున్నాయని గుర్తించలేకున్నారు.
సౌత్ చైనాలో 20,000 యువాన్ల (రూ. 2,28,506) బహుమతిని గెలుచుకోవడానికి మద్యం పోటీలో పాల్గొన్నాడు ఒక యువకుడు. అతని పేరు జాంగ్. కేవలం 10 నిమిషాల్లో ఒక లీటర్ స్ట్రాంగ్ మద్యం తాగి మరణించాడు. తన ఆఫీసుమేట్ ఇంటికి డిన్నర్‌కు వెళ్లినప్పుడు, అతని యజమాని మద్యపాన పోటీని నిర్వహించారు. ఈ క్రమంలో ఈ సంఘటన జరిగినట్లు తెలిసింది. ముందుగా టేబుల్ పై కూర్చొని మద్యం సేవిస్తున్న సమయంలో తన కంటే అధికంగా మద్యం ఎవరు తాగితే వారికి నగదు బహుమతి ఇస్తానని ప్రకటించారు ఆ గ్రూప్ లో ఒకరు. అదే సమయంలో అక్కడ ఉన్న తోటి ఉద్యోగుల్లో ఒకరు 5000 యువాన్లు ప్రకటిస్తే.. మరొకరు 10వేల యువాన్లు ప్రకటించారు. ఇలా వేలంలాగా పందెం సాగే క్రమంలో అతని బాస్ యాంగ్ ఎంటర్ అయ్యారు. ఈ లీటర్ మద్యం తాగితే వారికి అందరికన్నా అధికంగా 20వేల యువాన్లు ఇస్తానని ప్రకటించారు. దీంతో పోటీకి సిద్దమైన జంగ్ కేవలం 10 నిమిషాల్లో తాగి ప్రాణాలు కోల్పోయారు.
ఇదిలా ఉంటే మద్యం తాగే క్రమంలో ఓడిపోతే ఏం చేయాలో కూడా మాట్లాడుకున్నారు. ఇలా పరస్పరం ముచ్చటించుకుని ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ మద్యం పోటీలో ఓడిపోతే మరుసటి రోజు ఆఫీసు మొత్తానికి మధ్యాహ్నం టీ ట్రీట్ కి 10 వేల రూపాయలు ఖర్చు చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో అతని సొంత కార్ డ్రైవర్లు కూడా పాల్గొన్నారు. జాంగ్ తాగిన మద్యం బ్రాండ్ పేరు బైజియు. 30 నుంచి 60 శాతం వరకూ ఆల్కాహాల్ శాతం ఉండే చైనా స్పిరిట్ ఇది. దీనిని స్ట్రాంగ్ గా తీసుకుకోవడంతో సేవించిన పది నిమిషాల్లో కుప్పకూలిపోయారు. వెంటనే తోటి ఉద్యోగులు అతనిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అప్పటికే అతని పరిస్థితి విషమించింది. దీంతో ఆసుపత్రి వర్గాలు అతని శరీరం పాయిజన్ కి గురైనట్లు గుర్తించి ఊపిరితిత్తులు, గుండెను పరిశీలించారు. అప్పటికే గుండె స్పందన ఆగిపోవడాన్ని గమనించి జాంగ్ మరణించినట్లు నిర్థారించారు.
ఈ సంఘటన తరువాత ఒక కంపెనీ ప్రతినిథి WeChat గ్రూప్ లో స్పందించారు. జూలైలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారని తాజాగా ఆ సంస్థను మూసివేసినట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం చైనాలో కొత్తేమీ కాదు అంటున్నారు కొందరు పరిశీలకులు. గతంలో యూట్యూబ్ ఇన్ఫులెన్సర్ కూడా ఇలా మద్యం పోటీల్లో పాల్గొని 12 గంటల తరువాత మరణించినట్లు తెలిపారు. తాజాగా జంగ్ కేవలం 10 నిమిషాల్లోనే ప్రాణాలు విడిచారు. మద్యం తీవ్రతను బట్టి మరణాలు సంభవించినట్లు తెలుస్తోంది.
T.V.SRIKAR