JANASENA: అవనిగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి మండలి బుద్ధ ప్రసాద్ పేరును ఖరారు చేసింది జనసేన. అలాగే రైల్వే కోడూరు అభ్యర్థిగా అరవ శ్రీధర్‌ను ప్రకటించారు జనసేన అధినేత పవన్. ఇంతకుముందు ఈ స్థానం నుంచి యనమల భాస్కర రావును ప్రకటించారు. అయితే, భాస్కర రావుపై ఉన్న వ్యతిరేకత కారణంగా.. ఆయన స్థానంలో అరవ శ్రీధర్‌ను ఎంపిక చేశారు. గురువారం ఉదయం జనసేన నాయకులతో సమావేశమైన పవన్.. అవనిగడ్డ, పాలకొండ, రైల్వే కోడూరు అసెంబ్లీ స్థానాల అభ్యర్థులపై చర్చించారు.
BRS VASTU: బీఆర్ఎస్ ఓడింది అందుకేనా..? వాస్తు మార్పుతో ఇక తిరుగులేదా..!
వీటిలో అవనిగడ్డకు మండలి బుద్ధ ప్రసాద్, రైల్వే కోడూరుకు అరవ శ్రీధర్‌ను ఎంపిక చేయగా.. పాలకొండ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. మండలి బుద్ధ ప్రసాద్.. ఇటీవలే జనసేనలో చేరారు. ఆయన గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అంతకు ముందు ఇక్కడి నుంచే పలుమార్లు విజయం సాధించారు. దీంతో ఆయన సరైన అభ్యర్థి అని భావించడంతో పవన్ ఎంపిక చేశారు. మరోవైపు ఇప్పటికే ప్రకటించిన రైల్వే కోడూరు అభ్యర్థి యనమల భాస్కర రావుపై స్థానికంగా తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆయనకు జనసేన, టీడీపీ నేతలే సహకరించే పరిస్థితి లేదు. సర్వేలు కూడా ఆయనకు వ్యతిరేకంగానే ఉన్నాయి. అంతకుమించి యనమల.. వైసీపీ మంత్రి పెద్దిరెడ్డికి సన్నిహితుడిగా పేరుంది. అలాంటి వైసీపీ అనుకూల అభ్యర్థికి ఎలా టిక్కెట్ ఇస్తారంటూ స్థానిక నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో అభ్యర్థిని మార్చాలని పవన్ డిసైడయ్యారు.
పలువురి పేర్లను పరిశీలించిన అనంతరం, క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన నివేదికలు, జిల్లా నాయకుల అభిప్రాయాల అనంతరం అరవ శ్రీధర్‌ను ఖాయం చేశారు. ఇక జనసేన ప్రకటించాల్సింది పాలకొండ నియోజకవర్గం ఒక్కటే. ఆ నియోజకవర్గం నుంచి నిమ్మక జయకృష్ణకు జనసేన టిక్కెట్ దక్కే అవకాశాలన్నాయి. ఆయన ఇటీవలే టీడీపీ నుంచి జనసేన పార్టీలో చేరారు. ప్రస్తుతం ఆయనకు టిక్కెట్ దక్కొచ్చనే అంచనాలు ఉన్నాయి. అయితే అంతర్గతంగా సర్వేలు నిర్వహించిన తర్వాతే అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. మరో రెండు రోజల్లో పాలకొండ అభ్యర్థి పేరును జనసేన ప్రకటించబోతుంది. ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన కోలుకోగానే.. తిరిగి ప్రచారం ప్రారంభిస్తారు.