Manipur violence: ఏం చేసినా సమర్ధించే భక్తులు ఉండడం బీజేపీకే చెల్లింది. ఆఖరికి మణిపూర్ వివస్త్ర మహిళల ఘటనలోనూ తమ బుద్ధిని మార్చుకోలేకపోయారు మోదీ అభిమానులు..!
మణిపూర్‌లో ఇద్దరు మహిళలను వివస్త్రలుగా మార్చి అందులో ఒకరిని అత్యాచారం చేసిన ఘటనతో చాలామంది బీజేపీ నేతలు తొలిసారిగా ఆ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లపై స్పందించారు. ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చిన తర్వాత కూడా మాట్లాడకపోతే ప్రజలు తిట్టుకుంటారని భావించిన కమల నేతలు ఈ అమానవీయ చర్యను ముక్తకంఠంతో ఖండించారు. చాలామంది బీజేపీ మద్దతుదారులు సైతం జరిగిన ఘోరాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. ప్రధాని మోదీని నేరుగా నిందించకున్నా.. పరోక్షంగా విమర్శలు గుప్పించారు. అటు కొంతమంది మాత్రం ఇక్కడ కూడా తమ వికృత బుద్ధిని బయటపెట్టుకున్నారు. ఆ మహిళలకు అలానే అవ్వలంటూ పోస్టులు పెట్టారు.
కుకీ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు మహిళలను అత్యంత ఆటవీకంగా వారి బట్టలు విప్పతీసి, ఊరేగించడాన్ని బీజేపీ హార్డ్‌కోర్ మద్దతుదారులు సపోర్ట్ చేస్తున్నారు. ఆ కమ్యూనిటికి చెందిన మహిళలకు అలానే అవ్వాలంటూ పోస్టులు పెడుతున్నారు. ఇలా పిచ్చి పోస్టులు పెడుతున్న వారిలో మహిళలు కూడా ఉండడం ఘోరం. బీజేపీకి ట్విట్టర్‌లో ఎప్పటినుంచో పూర్తిస్థాయిలో మద్దతిస్తున్న వారు ఈ రకమైన ట్వీట్లు చేస్తుండడం విస్మయానికి గురిచేస్తోంది. అసలు సాటి మహిళలకు జరిగిన దారుణం పట్ల కనీసం జాలి కూడా చూపించకపోవడం చూస్తుంటే చిరాకు వేస్తోంది. ఇలాంటి విషయాల్లో కూడా రాజకీయాలు తీసుకొస్తారా అని ప్రజలు మండిపడుతున్నారు.
మరికొందరు మరింత వెర్రి వేషాలు వేస్తున్నారు. హిందూ మైతీ మహిళలపై కుకీ, నాగా క్రిస్టియన్ పురుషులు ఎక్కువగా అత్యాచారాలకు పాల్పాడుతున్నారని.. ఈ విషయాన్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయాలంటున్నారు. అది నిజమో కాదోనన్నది అటుంచితే ఇక్కడ ముగ్గురు మహిళలపై జరిగిన ఘోరం పట్ల స్పందించకుండా.. ఆ ముగ్గురు మహిళలు క్రిస్టియన్లని.. ఆ కమ్యూనిటీ పురుషులు హిందువులపై అత్యాచారాలకు పాల్పడ్డారని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ ఈ పనికిమాలిన వాదనా నిజమేనని కాసేపు అనుకున్నా.. ఈ రెండు సందర్భాల్లోనూ బలైపోయింది మహిళలే కదా. ఆ విచక్షణ లేకుండా తమ మతం మహిళలు.. పరాయి మతం మహిళలు అని విద్వేషం నింపితే ఎలా..? అసలు వీళ్లంతా మనుషులేనా..? ఇక్కడ కూడా మత రాజకీయాలు చేస్తారా..? మహిళలను దేవతలుగా పూజిస్తామని చెప్పుకునే వీళ్ల మనసుల్లో ఇంత ద్వేష భావం దాగుందా..? పైకి చెప్పే మాటలకు, చేసే పనులకు ఏ మాత్రం పొంతన ఉండదు. ఈ ఘటనను సమర్థించేవాళ్లు కూడా ఆ నేరం చేసినవాళ్లతో సమానమే.!