మన్సూర్ అలీఖాన్ కి గూబ గుయ్యిమంది. పనికి మాలిన వివాదంలోకి చిరంజీవిని లాగి.. చివరికి చెప్పు దెబ్బలు తిన్నాడు మన్సూర్. త్రిషని అసభ్యంగా కామెంట్స్ చేసాడు. ఏందయ్యా ఇది అంటూ.. అందరూ తలంటేసరికి.. అబ్బే నా మాటల్లో ఉద్దేశం అది కాదు.. సారీ అంటూ కాస్త తగ్గినట్లే తగ్గాడు. కానీ.. రివర్స్‌లో పరువు నష్టం దావా వేశాడు. కట్ చేస్తే.. చేసిందే తప్పు.. మళ్లీ డిఫమేషన్ వేస్తావా అంటూ మద్రాసు హైకోర్టు చివాట్లు పెట్టింది.
లియో సినిమాలో రేప్ సీన్ ఉంటుందనుకున్నానంటూ నటుడు మన్సూర్ అలీ ఖాన్ చేసిన కామెంట్స్.. ఓ రేంజ్‌లో వివాదాస్పదమయ్యాయి. ఇదే ఇష్యూలో మన్సూర్‌ను నటి త్రిష కడిగిపారేసింది. ఆ తర్వాత సహచర నటులు, పక్క రాష్ట్రాల ఇండస్ర్టీ నుంచి విమర్శలు వచ్చాయి. అటు జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. దీంతో.. మన్సూర్ అలీపై కేసు కూడా నమోదైంది. అయితే.. దుమారం పెరుగుతుండటంతో.. తాను అన్న మాటల అర్థం అది కాదనీ.. తప్పయితే క్షమించాలంటూ వేడుకున్నాడు మన్సూర్.
అయితే.. త్రిషకు తమిళ ఇండస్ట్రీ నుంచి ఖష్బూ, టాలీవుడ్ నుంచి చిరంజీవి ఎక్కువగా సపోర్ట్ చేశారు. తన కామెంట్స్‌పై సారీ చెప్పిన తర్వాత.. త్రిషపై చేసిన వ్యాఖ్యల విషయంలో చిరంజీవి, ఖుష్బూపై పరువు నష్టం దావా వేశాడు మన్సూర్. ఈ కేసు విచారణ జరిపిన మద్రాస్ హైకోర్ట్.. మన్సూర్ అలీ ఖాన్‌పై సీరియస్ అయింది. నువ్వే అసభ్యంగా మాట్లాడి.. క్షమాపణలు చెప్పి.. మళ్లీ రివర్స్‌లో కేసు పెడతావా అంటూ క్లాస్ తీసుకుంది. అంతే కాకుండా.. మన్సూర్ వ్యవహారశైలి, మాటలు తరచూ వివాదాస్పదమవుతూనే ఉన్నాయంటూ మద్రాస్ హైకోర్టు అభిప్రాయపడింది. సొసైటీలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవాలంటూ చురకలంటించింది. అసభ్యంగా కామెంట్స్ చేసి బాధించినందుకు నటి త్రిష కేసు పెట్టాలి కానీ.. మన్సూర్ కేసు పెట్టడంలో అర్థం లేదంటూ ఆయన తరఫు న్యాయవాదికి కోర్టు అక్షింతలు వేసింది. అయితే.. ఓ వైపు కోర్టు మొట్టికాయలు వేస్తున్నా.. మన్సూర్ అలీఖాన్ న్యాయవాది మాత్రం తన వాదనలు వినిపించారు. తన క్లయింట్ నిర్దోషి అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇష్యూకు సంబంధించి పూర్తి వీడియో చూడాలనీ.. అప్పడు మన్సూర్‌పై వ్యాఖ్యలకు సంబంధించిన పోస్టులను తొలగించేలా ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. దీంతో.. తమ స్టేట్‌మెంట్స్ ఇవ్వాలంటూ త్రిష, ఖుష్బూ, చిరంజీవిని ఆదేశించిన న్యాయమూర్తి.. తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేశారు.