‌Hyderabad Metro: మెట్రో మూడో దశ ప్రతిపాదనలు.. అందులో తొలగించిన ప్రాంతాలు ఇవే..

మెట్రో హైదరాబాద్ వాసులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. దీని రాకతో ప్రతి రోజూ వేల మంది అనేక ప్రాంతాలకు ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ సేవలను మరింత విస్తరించే ఆలోచనలో ఉంది హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్దం చేసింది.

  • Written By:
  • Publish Date - August 14, 2023 / 12:52 PM IST

తాజాగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. ఇందులో కొన్ని ప్రదానమైన ప్రాంతాలతో పాటూ ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ఏరియాల్లో మెట్రో సేవలు అందించేందుకు వీలుపడలేదు. గతంలో నగర ట్రాఫిక్ ను సమగ్రంగా అధ్యయనం చేసినప్పటికీ ఆప్రాంతాల్లో మెట్రో పనులు ప్రారంభించేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందించలేదు. దీంతో గతంలో ప్రతిపాదించిన ప్రాంతాలు మూడోదశ మెట్రో అభివృద్ది పనులకు నోచుకోలేదని చెప్పాలి. గతంలో కేసీఆర్ చెప్పిన దాని ప్రకారం అవుటర్ రింగ్ రోడ్డు పరిధిలో మెట్రోను విస్తరించాలని వార్తలు వచ్చాయి. కానీ ముందుగా ఇన్నర్ రింగ్ రోడ్డు పూర్తిచేసి ఆతరువాత అవుటర్ పనులు ప్రారంభించాలని మెట్రో అధికారులు భావిస్తున్నారు.

హైదరాబాద్ నగర వ్యాప్తంగా 2041 నాటికి 321 కిలోమీటర్ల మెట్రో అవసరం అవుతుందని అంచనా వేశారు. దీనిని పదేళ్ల క్రితమే లీ అసోసియేట్స్ సంస్థ సమగ్ర రవాణా నివేదికలో పేర్కొంది. రవాణా మాస్టర్ ప్లాన్ ప్రకారమే స్వల్ప, మధ్య, దీర్ఘకాల ప్రణాళికలను ముందుగా పూర్తి చేయాలని సూచించింది. 2022 నుంచి 2031 నాటికి 175 కిలోమీటర్ల మెట్రోని నగర వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని అప్పట్లో నివేదికలో తెలిపింది. వీటిలో పరిస్థితులను బట్టి మార్పులు చేస్తూ వచ్చారు. తాజాగా ఏర్పాటైన సమావేశంలో ఇన్నర్ రింగ్ రోడ్డు మార్గాలను ప్రకటించే వరకూ ప్రతి పాదనలు అన్నీ అవుటర్ రింగ్ రోడ్డులోనే ఉండేవి.

ప్రతిపాదనల్లో మార్పులు ఇవే..

  • ఎంజీబీఎస్ నుంచి ఘట్ కేసర్ వరకూ 23.2 కిలోమీటర్లు ఉండేది. దీనిని కొత్తగా ఉప్పల్ నుంచి ఘట్ కేసర్ కు మార్చారు.
  • జేబీఎస్‌ నుంచి కూకట్‌పల్లి వై జంక్షన్‌ వరకూ 9.6 కిలోమీటర్ల ప్రతిపాదనను ఇప్పుడు అస్సలు ప్రస్తావించలేదు.
  • తార్నాక నుంచి కీసర నుంచి ఓఆర్ఆర్ మీదుగా 19.6 కిలోమీటర్ల మార్గాన్ని ప్రస్తుతం ఈసీఐఎల్ వరకూ ప్రతిపాదించారు.
  • నానక్ రాం గూడ నుంచి బీహెచ్ఈఎల్ వరకూ 13.7 కిలోమీటర్లు పాత ప్రతిపాదనలో ఉండేది. కానీ మూడోదశలో పొందుపరచలేదు.
  • నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఎల్బీనగర్ నుంచి చంద్రాయణ గుట్ట, ఫలక్ నుమ నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కి రెండో దశ మెట్రో విస్తరణలోనే ప్రతిపాదనలు ఉన్నప్పటికీ పనులకు నోచుకోలేదు.
  • ఇబ్రహీంపట్నం నుంచి ఎల్బీనగర్ వరకూ మెట్రో వేయాల్సిందిగా నగరవాసులు కోరుకుంటున్నప్పటికీ దీనిని ప్రతిపాదనలో చోటు కల్పించలేదు.
  • చంద్రాయణగుట్ట నుంచి ఆరాంఘర్, రేతిబౌలి వరకూ 16.1 కిలోమీటర్ల మెట్రో ప్రతిపాదన ఉన్నప్పటికీ ఎక్స్ ప్రెస్ మార్గం ఉండటంతో చివరి నిమిషంలో చేర్చారు.

గతంలో కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ నగరం చుట్టూ రింగు రోడ్డు నిర్మించారు. అది ప్రస్తుతం ఇన్నర్ రింగురోడ్డుగా రూపుదిద్దుకుంది. ఆ ప్రాంతాలు ఇప్పుడు సెంటర్ ఆఫ్ సిటీగా మారిపోయాయి. అవే బంజారాహిల్స్‌, పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్‌, ఉప్పల్‌, ఎల్బీనగర్‌ ప్రాంతాలు. ఇవి మొదటి దశలోనే మెట్రో ప్రాంతాలుగా అభివృద్ది చెందాయి. అయితే నిత్యం ట్రాఫిక్ తో రద్దీగా ఉండే చాంద్రాయణగుట్ట, ఆరాంఘర్‌, మెహిదీపట్నంతో పాటూ నాగోల్ నుంచి గ్రీన్ లాండ్స్ వరకూ మెట్రోని విస్తరించాలని స్థానికులు కోరుకుంటున్నారు. దీనిపై మెట్రో అధికారులు స్పందిస్తూ గతంలో సూచించిన ప్రతి ఒక్క ప్రాంతంలో మెట్రో మార్గాలను అనుసంధానం చేస్తామని, వేటిని వదిలివేయడం ఉండదని పేర్కొన్నారు. అయితే ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్తాం అని తెలిపారు.

గతంలో తమ ప్రాంతంలో మెట్రో వస్తుంది అని భావించిన వారికి ఈ సారి కూడా నిరాశ తప్పదనే చెప్పాలి.