Congress Second List: సెకండ్‌ లిస్ట్‌తో కాంగ్రెస్‌లో రచ్చ.. పెరుగుతున్న అసంతృప్తులు

కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ తో నాయకుల్లో పెరిగిన అసంతృప్తి. దీని ప్రభావం పార్టీపై ఎలా ఉండబోతుంది. అధిష్టానం బుజ్జగింపులకు వీరు లొంగుతారా అనేది ఆసక్తిగా మారింది.

  • Written By:
  • Publish Date - October 28, 2023 / 01:32 PM IST

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ వచ్చేసింది. చాలా సంచనాలు కనిపించాయ్ ఆ జాబితాలో! రెండో జాబితాలో ఆయా నియోజకవర్గాల్లో టికెట్ ఆశించిన వారిలో చాలామంది నేతలు నిరాశ గురయ్యారు. దీంతో కొందరు ఎవరి దారి వారు చూసుకుంటుంటే.. మరికొందరు అధిష్టానంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 45 మందితో కాంగ్రెస్ సెకండ్ లిస్ట్ అనౌన్స్ చేసింది. టికెట్ రాని వాళ్లు భగ్గుమంటున్నారు. నిర్మల్ జిల్లా బైంసాలో కాంగ్రెస్ నేత డాక్టర్ కిరణ్ అనుచరులతో భేటీ అయ్యారు. ముథోల్ కాంగ్రెస్ టికెట్ ఆశించిన కిరణ్.. టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల బరిలో ఉంటానని, అభిమానులు అధైర్య పడొద్దని పిలుపునిచ్చారు.

అదిలాబాద్ జిల్లాకు చెందిన బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు. టికెట్ రాకపోవటంతో ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిన ఆయన బోథ్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించారు. వెన్నెల అశోక్ కు పార్టీ టికెట్ కేటాయించింది. జడ్చర్ల, నారాయణపేట్ నియోజకవర్గాల్లో ఎర్ర శేఖర్ టికెట్ ఆశించారు. కాంగ్రెస్ అధిష్టానం జడ్చర్ల అనిరుధ్ రెడ్డి, నారాయణపేట పరిణికా రెడ్డికు టికెట్ కేటాయించింది. దీంతో ఎర్ర శేఖర్ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. వనపర్తి నియోజకవర్గం నుంచి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి టికెట్ ఆశించారు. ఐతే మరోసారి కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డికే పార్టీ అధిష్టానం అవకాశం కల్పించింది. ఎల్లారెడ్డి నియోజకవర్గం టికెట్‌ను సుభాష్ రెడ్డి ఆశించగా.. మదన్ మోహన్ రావుకు దక్కింది. దీంతో సుభాష్ కూడా గుర్రుగా ఉన్నారు.

నర్సాపూర్ టికెట్‌ ఆశించిన గాలి అనిల్‌కు చుక్కెదురైంది. ఆ నియోజకవర్గం నుంచి అధిష్టానం ఆవుల రాజిరెడ్డికి టికెట్ కేటాయించింది. హుజురాబాద్ నియోజకవర్గం నుంచి బల్మూరి వెంకట్ టికెట్ ఆశించారు. ఐతే వొడితల ప్రణవ్‌కు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించింది. అక్కడ కూడా లుకలుకలు మొదలయ్యాయ్. హుస్నాబాద్ నియోజకవర్గం టిక్కెట్‌ను ప్రవీణ్ రెడ్డి ఆశించారు. పొన్నం ప్రభాకర్‌కు అధిష్టానం టికెట్ కేటాయించింది. మహబూబాబాద్ టిక్కెట్ ఆశించిన బలరాం నాయక్, బెల్లయ్య నాయక్‌లకు టికెట్ దక్కలేదు. ఇక్కడ మురళీ నాయక్‌కు టికెట్ కేటాయించింది కాంగ్రెస్‌. పాలకుర్తి నుంచి తిరుపతిరెడ్డి కూడా టికెట్ ఆశించారు. ఇక్కడ యశస్వినికి అధిష్టానం అవకాశం కల్పించింది. జూబ్లీహిల్స్ నుంచి విష్ణువర్దన్ రెడ్డి మరోసారి బరిలోకి దిగేందుకు అవకాశం దక్కుతుందని ఆశించారు. కానీ, ఈ నియోజకవర్గం నుంచి అజహరుద్దీన్‌ను అధిష్టానం బరిలోకి దింపింది. అంబర్‌పేట నుంచి టిక్కెట్ ఆశించిన నూతి శ్రీకాంత్, మోతె రోహిత్‌కు చుక్కెదురైంది.

ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అధిష్టానం రోహిన్ రెడ్డికి అవకాశం కల్పించింది.మహేశ్వరం టిక్కెట్ ఆశించిన పారిజాత నర్సింహారెడ్డి నిరాశే ఎదురైంది. ఈ నియోజకవర్గం నుంచి లక్ష్మారెడ్డికి అధిష్టానం అవకాశం కల్పించింది. దేవరకొండ నియోజకవర్గం టికెట్ ఆశించిన వడ్త్యా రమేష్ నాయక్‌కు నిరాశే ఎదురైంది. ఐతే ఇప్పుడు అసంతృప్తులంతా హస్తం మీద తిరుగుబాటు బావుటా ఎగురవేసేందుకు సిద్ధం అవుతున్నారు. అదే నిజం అయితే.. ఎన్నికల వేళ గాంధీభవన్‌లో చిన్నపాటి తుఫాన్ పుట్టడం ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.