ఖమ్మం జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి పువ్వాడ అజయ్‌కు వ్యతిరేకంగా మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. కేంద్ర కమిటీ సభ్యుడు ఆజాద్ పేరుతో లేఖ రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ ఇద్దరూ కార్పోరేట్ రాజకీయ నాయకులేనని, వేల కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమవుతున్న పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని లేఖలో రాశారు. పొంగులేటి, పువ్వాడ ఇద్దరూ అక్రమ మార్గంలో కోట్లు సంపాదించారని.. ప్రస్తుతం వీరి దోపిడీ మూడు పువ్వులు ఆరు కాయలు కావాలంటే ఇద్దరికి అధికారం అవసరమంటూ చెప్పారు.
అవినీతి డబ్బుతో అందలం ఎక్కేందుకు, అధికారం చేజిక్కించుకునేందుకు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారని ఆరోపించారు. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతిలో కీలుబొమ్మగా మారిపోయిందని ఆరోపించారు. ఈ లెటర్ ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో కలకలం సృష్టిస్తోంది. కొంత కాలం నుంచి పాలేరు సీట్ కోసం పొంగులేటి, కమ్యూనిస్ట్‌లు పట్టుబడుతున్నారు. పాలేరు సీట్ తనకే కావాలంటూ పొంగులేటి డిమాండ్ చేస్తున్నారు. అదే సీట్ కోసం కమ్యూనిస్టులు కూడా పట్టుబడుతున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఇదే హాట్ టాపిక్‌గా కొనసాగుతోంది. ఇలాంటి టైంలో మావోయిస్టుల నుంచి పొంగులేకి వ్యతిరేకంగా లేఖ రావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.