టీమిండియా కోచ్ గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గౌతమ్ గంభీర్ దూకుడుగానే వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా ఏ సిరీస్ కు ఏ ఆటగాళ్ళు జట్టులో ఉంటే బెటరో అన్నదానిపై పక్కా ప్లాన్ తో ముందుకెళుతున్నాడు. ఫామ్ , ఫిట్ నెస్ వంటి విషయాల్లో ఏ మాత్రం రాజీ పడడం లేదు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరికీ ఒకటే రూల్ పాటిస్తున్నాడు. అదే సమయంలో యంగస్టర్స్ ను కీలక ఆటగాళ్ళుగా తయారు చేసే బాధ్యతను కూడా తీసుకున్నాడు. తాజాగా న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ఎంపికలో గంభీర్ ఫ్యూచర్ ప్లాన్ స్పష్టంగా కనిపిస్తోంది. రిజర్వ్ ప్లేయర్స్ గా నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ కృష్ణలను ఎంపిక చేయడం వెనుక గంభీర్ ప్రత్యేకమైన వ్యూహం తెలుస్తోంది.
ఆల్ రౌండర్ నితీశ్ ను మరింత మెరికలా తీర్చిదిద్దడమే టార్గెట్ గా పెట్టుకున్న గంభీర్ ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను కూడా ఆసీస్ టూర్ కు సిద్ధం చేస్తున్నాడు. నిజానికి ఆసీస్ తో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం బూమ్రా, సిరాజ్, షమీ వంటి సీనియర్లతో పాటు మరికొందరు యువ పేసర్లపైనా గంభీర్ ఫోకస్ పెట్టాడు. ఆసీస్ పిచ్ లకు సరిగ్గా సరిపోయే మయాంక్ యాదవ్, హర్షిత్ రాణాలను కివీస్ తో సిరీస్ కోసం ఎంపిక చేయించాడు. మయాంక్ 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తుండగా.. హర్షిత్ రాణా బౌలింగ్ లోనూ పేస్ వైవిధ్యం ఉంది. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన వీరంతా ఇప్పటికిప్పుడే టెస్ట్ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారా అంటే పూర్తిగా చెప్పలేం. కానీ బౌలింగ్ కోచ్ మోర్కెల్ ఆధ్వర్యంలో వీరి బౌలింగ్ పై మరింత ఫోకస్ పెడుతున్నట్టు అర్థమవుతోంది.
అలాగే ఆల్ రౌండర్ గా నితీశ్ కుమార్ రెడ్డి కూడా ఆసీస్ టూర్ కు సెలక్ట్ అవుతాడని ఖచ్చితంగా చెప్పలేకున్నా… గంభీర్ మాత్రం అతన్ని పరిగణలోకి తీసుకుంటున్నట్టు అర్థమవుతోంది. హార్థిక్ పాండ్యా తర్వాత జట్టులో సరైన ఆల్ రౌండర్ కోసం ఎదురుచూస్తున్న భారత మేనేజ్ మెంట్ కు నితీశ్ దానిని భర్తీ చేస్తాడని భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడే నితీశ్ పై నిర్ణయానికి రాలేకున్నా… జట్టుతో పాటే కొనసాగిస్తూ అతన్ని పూర్తిస్థాయి ఆల్ రౌండర్ గా తీర్చిదిద్డడంపైనే గంభీర్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తం మీద బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం బ్యాకప్ పేసర్లుగా యువ ఆటగాళ్ళను గంభీర్ రెడీ చేస్తున్నాడు.