భారత యువ పేసర్ మయాంక్ యాదవ్ త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ కు ఈ స్పీడ్‌స్టర్ టీమిండియా తరఫున అరంగేట్రం చేయనున్నట్లు సమాచారం. ఢిల్లీకి ఆడుతున్న ఫాస్ట్ బౌలర్ ఈ ఏడాది ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చాడు. లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ రైటార్మ్ బౌలర్.. తన మెరుపు వేగంతో హాట్‌టాపిక్‌గా మారాడు. గంటకు 150కి పైగా కిలో మీటర్ల వేగంతో బంతులు విసురుతూ అందరినీ ఆకట్టుకున్నాడు. లక్నో తరఫున వరుసగా రెండు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకుని.. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన మొదటి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.
అయితే గాయం కారణంగా మయాంక్ జట్టుకు దూరం కావాల్సి వచ్చింది. జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స పొందిన 22 ఏళ్ల మయాంక్.. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్నాడు. మ్యాచ్ ఫిట్‌నెస్ కూడా సాధించాడు. ప్రస్తుతం ఎన్సీఎలో రోజూ 20 ఓవర్ల పాటు అతను ప్రాక్టీస్ చేస్తున్నాడు. దీంతో బంగ్లాతో టీ ట్వంటీ సిరీస్ కు అతన్ని తీసుకోవాలని గంభీర్ సెలక్టర్లకు సూచించినట్టు తెలిసింది. కాగా వరుస టెస్టు సిరీస్‌లు ఉన్న కారణంగా.. బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్ కు యువ ఆటగాళ్ళ వైపే సెలక్టర్లు మొగ్గు చూపుతున్నారు. ఒకవేళ బంగ్లాతో టీ ట్వంటీ సిరీస్ లో ఎటువంటి ఇబ్బంది లేకుండా మయాంక్ ఆకట్టుకుంటే ఆసీస్ పర్యటనకూ అతన్ని పరిగణలోకి తీసుకుంటారని తెలుస్తోంది.