కోహ్లీని కెలక్కండి, ఆసీస్ కు మెక్ గ్రాత్ వార్నింగ్

ఆస్ట్రేలియా సిరీస్ ఆడుతుందంటే ఆటతో పాటు స్లెడ్జింగ్ కూడా ఖఛ్చితంగా ఉంటుంది...అసలు ఆట కంటే ముందు మాటలతో ప్రత్యర్థి ఆటగాళ్ళను దెబ్బతీయడమే కంగారూల వ్యూహం.. గత కొన్నేళ్ళుగా మైదానంలో వారికిది సర్వసాధారణంగా మారిపోయింది.

  • Written By:
  • Publish Date - November 18, 2024 / 08:39 PM IST

ఆస్ట్రేలియా సిరీస్ ఆడుతుందంటే ఆటతో పాటు స్లెడ్జింగ్ కూడా ఖఛ్చితంగా ఉంటుంది…అసలు ఆట కంటే ముందు మాటలతో ప్రత్యర్థి ఆటగాళ్ళను దెబ్బతీయడమే కంగారూల వ్యూహం.. గత కొన్నేళ్ళుగా మైదానంలో వారికిది సర్వసాధారణంగా మారిపోయింది. కానీ వారి సొంతగడ్డపై ఆసీస్ కు ఆటతోనే కాకుండా మాటలతో ధీటుగా బదులిచ్చిన జట్టు టీమిండియానే… ముఖ్యంగా కోహ్లీ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఇరు జట్ల మధ్య స్లెడ్జింగ్ ఓ రేంజ్ లో జరిగేది.. ఇక క్రీజులో కోహ్లీని అనవసరం స్లెడ్జింగ్ చేసి ఆసీస్ చాలా సార్లు భారీ మూల్యం చెల్లించుకుంది. పాంటింగ్, మైకేల్ క్లార్క్ వంటి మాజీలు స్వయానా కోహ్లీని రెచ్చగొట్టి మ్యాచ్ లో ఆటపరంగా శిక్ష అనుభవించారు. నిజానికి కోహ్లీ నార్మల్ గా ఉంటే పర్వాలేదు… అనవసరం రెచ్చగొడితే మాత్రం మాటతో అప్పటికప్పుడే సమాధానం ఇవ్వడంతో పాటు బ్యాట్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తాడు. ఈ విషయాన్ని రెండు సిరీస్ ల తర్వాత కానీ ఆసీస్ ఆటగాళ్లు గ్రహించలేకపోయారు.

ఇప్పుడు మళ్ళీ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభం కానుండడంతో అందరి దృష్టీ కోహ్లీపైనే ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్ దిగ్గజ పేస్ బౌలర్ గ్లెన్ మెక్ గ్రాత్ తన జట్టుకు వార్నింగ్ ఇచ్చాడు. కోహ్లీని స్లెడ్జింగ్‌ చేయొద్దని తమ ఆటగాళ్లకు సూచించాడు. అతన్ని రెచ్చగొడితే ఆసీస్ టీమ్ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని తేల్చేశాడు.
కోహ్లీ దగ్గర స్లెడ్జింగ్ వంటి అత్యుత్సాహ ఘటనలు పనిచేయవన్న మెక్‌గ్రాత్.. అతన్ని రెచ్చగొట్టడం వల్ల జట్టుకు ఎలాంటి లాభం ఉండదని చెప్పుకొచ్చాడు. అతని మానాన అతన్ని వదిలేస్తే, ఆతిథ్య జట్టుకు ఎంతో మేలు చేసినవారు అవుతారని మెక్ గ్రాత్ అన్నాడు. ప్రస్తుతం ఫామ్ లో లేని కోహ్లీపైన ఒత్తిడి ఎక్కువగానే ఉందన్న మెక్ గ్రాత్. ఆసీస్‌ బౌలర్లు అతన్ని లక్ష్యంగా చేసుకుంటారనడంలో సందేహం లేదన్నాడు. కానీ మాటలతో రెచ్చగొడితే మాత్రం విరాట్ చెలరేగిపోతాడని గుర్తు చేశాడు. ఇక ఒక్కసారి కోహ్లీ ఫామ్ లోకి వచ్చాడంటే తమ బౌలర్లకు చుక్కలు కనిపిస్తాయని వ్యాఖ్యానించాడు. ఒత్తిడిలో ఉన్న అతన్ని అలానే వదిలేయడం ఉత్తమమని సలహా ఇచ్చాడు. ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ అలాంటివి చేయడనే అనుకుంటున్నట్టు వ్యాఖ్యానించాడు.

విరాట్ సాధారణ మ్యాచుల్లోనే చాలా సీరియస్‌గా, ఫుల్ డెడికేషన్‌తో బ్యాటింగ్ చేస్తుంటాడు. అలాంటిది ఆసీస్ లాంటి టీమ్స్‌తో మ్యాచ్‌ అంటే మరింత ఫోకస్ ఆడతాడు. పైగా గత కొంతకాలంగా తన స్థాయికి తగినట్టు ఆడలేకపోతున్న విరాట్ కంగారూ గడ్డపై చెలరేగేందుకు ఉవ్విళ్ళూరుతున్నాడు. ఒకవేళ ఆసీస్ క్రికెటర్లు స్లెడ్జింగ్ చేస్తే మాత్రం విరాట్ కు ఎక్స్ డ్రా ఎనర్జీ ఇచ్చినట్టేనని అటు ఫ్యాన్స్ సైతం తేల్చేశారు. ఒకవిధంగా కంగారూలు స్లెడ్డింగ్ చేయాలని కూడా ఇండియన్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కాగా ఆసీస్ లో విరాట్ కు తిరుగులేని రికార్డుంది. ఆస్ట్రేలియా గడ్డపై కోహ్లీ 13 టెస్టుల్లో 1352 పరుగులు చేయగా.. దీనిలో 6 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే భారత్, ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా తొలి టెస్ట్ నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ఆరంభం కానుంది.