ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఎన్టీఆర్‌కు నివాళులర్పిస్తూ ఓ ట్వీట్ చేశారు. నూటికో కోటికో ఒక్కరు.. వందేళ్లు కాదు.. చిరకాలం, కలకాలం మన మనస్సులో మిగిలిపోతారు. చరిత్ర వారి గురించి భావితరాలకి గర్వంగా చెబుతుంది. అలాంటి కారణ జన్ముడు ఎన్టీఆర్. తెలుగు జాతి ఘనకీర్తికి వన్నె తెచ్చిన నందమూరి తారక రామారావు గారితో నా అనుబంధం నాకెప్పుడూ చిరస్మరణీయం.
రామారావు శతజయంతి సందర్భంగా వారిని స్మరించుకుందాం అంటూ ట్వీట్ చేశారు. ఇక మెగాస్టార్ తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎన్టీఆర్‌ను స్మరిస్తూ ట్వీట్ చేశాడు. చరిత్ర మరవని నటనా కౌశలం.. తెలుగు నుడికారంపై మమకారం.. పార్టీని స్థాపించిన 8 నెలల్లోనే అధికారం కైవసం.. ఇలా మాట్లాడుతుంటే స్పురణకు వచ్చే ఒకే ఒక పేరు స్వర్గీయ నందమూరి తారక రామారావు. ఆయన శత జయంతి సందర్భంగా అంజలి ఘటిస్తున్నాను.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ఎంతో మేలైనది. ఎందరికో అనుసరణీయమైనది. ఢిల్లీ రాజకీయాల్లో గుర్తింపునకు నోచుకోక తెలుగు ఖ్యాతి మసకబారుతున్నతరుణంలో తెలుగు వారి ఆత్మగౌరవం నినాదంతో ఎన్నికల బరిలో నిలిచి.. అజేయమైన విజయం అందుకుని ఢిల్లీ దాకా తెలుగువారి సత్తా చాటారు.
ఈ పుణ్య దినాన ఆ మహనీయుడికి నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన నీరాజనాలు అర్పిస్తున్నానంటూ ప్రెస్‌నోట్ రిలీజ్ చేశాడు. కేవలం చిరంజీవి పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా సిని రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు నివాళులర్పించారు.