MEGASTAR CHIRANJEEVI: దారి తప్పిన అన్నయ్య.. కూటమికి ప్రచారం.. మళ్లీ రాజకీయాల వైపు చిరంజీవి

10 ఏళ్ల కింద తాను రాజకీయాలకు దూరం అని చెప్పాడు. తాను ఎవరి వైపు కాదన్నాడు. ఇప్పుడు నిదానంగా ప్లేట్ మార్చి కూటమికి ప్రచారం మొదలు పెట్టాడు. ఇదంతా వ్యూహాత్మకంగా చిరంజీవి ముందే ప్లాన్ చేసుకున్నారా.. బీజేపీతో కూడా మాట్లాడుకున్నారా..?

  • Written By:
  • Publish Date - April 28, 2024 / 03:25 PM IST

MEGASTAR CHIRANJEEVI: ముసుగు నుంచి చిరంజీవి బయటకు వచ్చాడు. ఏపీలో ఎన్డీఏ కూటమికి ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఐదేళ్ల పాటు సినిమా ఇండస్ట్రీనీ ఒక ఆట ఆడుకున్న జగన్‌పై.. పగ తీర్చుకోవడానికి సిద్ధమవుతున్నాడు మెగాస్టార్. 10 ఏళ్ల కింద తాను రాజకీయాలకు దూరం అని చెప్పాడు. తాను ఎవరి వైపు కాదన్నాడు. ఇప్పుడు నిదానంగా ప్లేట్ మార్చి కూటమికి ప్రచారం మొదలు పెట్టాడు. ఇదంతా వ్యూహాత్మకంగా చిరంజీవి ముందే ప్లాన్ చేసుకున్నారా.. బీజేపీతో కూడా మాట్లాడుకున్నారా.. ఇప్పుడు తన వ్యూహాన్ని అమలు చేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది.

Rishabh Pant: రిషబ్ పంత్‌పై నిషేధం..?

సినిమా ఇండస్ట్రీతో మొదటి నుంచి వైసీపీకి మంచి సంబంధాలు లేవు. దానికి ప్రధాన కారణం టాలీవుడ్ 70శాతం పైగా కమ్మ సామాజికవర్గం చేతిలో ఉండడమే. దీనికి తోడు సినిమా ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్‌.. జగన్‌కి ఏకు మేకై కూర్చున్నాడు. అటు కమ్మ సామాజికవర్గానికి చెందిన హీరోలు, నిర్మాతలు, డైరెక్టర్లు కూడా జగన్ సర్కార్‌కి వ్యతిరేకమే. మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా జగన్‌కి వ్యతిరేకం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని గడచిన 5 ఏళ్లలో జగన్ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒక ఆట ఆడుకున్నాడు. ప్రధానంగా టికెట్ల ధరలను ఎలా పడితే అలా పెంచుకోడాన్ని అడ్డుకుంటూ ఏపీలో షూటింగ్ చేస్తేనే సినిమా టికెట్లు పెంచుకునే వీలు ఉందంటూ జీవో జారీ చేశారు. అంతేకాదు సినిమా టికెట్ పెంపునకు సినిమా నిర్మాణం ఖర్చుకి లింక్ పెట్టారు. మూవీ విడుదల రోజు ఆరు షోలు వేసుకోవడం టికెట్ రేట్లు, నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లే ఎలా పడితే అలా అడ్డగోలుగా నిర్ణయించుకోవడం.. వీటన్నిటికి జగన్ సర్కార్ బ్రేకులు వేసింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సినిమాలను టార్గెట్ చేస్తూ టికెట్ ధర పెంపు ఐదు రూపాయలకు మించకూడదని స్పష్టం చేసింది జగన్ సర్కార్. ఆ సంక్షోభం నుంచి బయటపడడానికి చిరంజీవి నాయకత్వంలో మహేష్‌బాబు, ప్రభాస్, నాగార్జున ఇతర హీరోలు అంతా కలిసి సీఎం జగన్‌తో భేటీ అయ్యారు.

BJP: బీజేపీకి దక్షిణాది దెబ్బ తప్పదా..? ఈసారి సత్తా చాటుతుందా..?

చిరంజీవి బృందంతో జగన్ వ్యవహరించిన తీరుపై అప్పట్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఏదేమైనా అప్పటి నుంచి కాచుక్కూర్చుని ఉన్న చిరంజీవి.. ఎన్నికల ముందు కూటమి అభ్యర్థులకి ప్రచారం మొదలుపెట్టడం ద్వారా తాను ఏ వర్గం వైపు ఉన్నారో తేల్చేశారు. పదేళ్ల నుంచి క్రియాశీలక రాజకీయాలకి దూరంగా ఉన్న చిరంజీవి.. ఇప్పుడు ఎన్నికల ముందు కూటమి అభ్యర్థులకి ప్రచారం చేయడం ద్వారా పెద్ద వివాదానికి దారి తీశారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు.. ఐదు కోట్ల రూపాయల చెక్కును పార్టీ విరాళంగా ఇచ్చి.. తన మద్దతు ఏంటో కూడా చిరంజీవి చెప్పేశారు. అంతేకాకుండా గడిచిన మూడు నాలుగు సంవత్సరాలుగా చిరంజీవి వీలున్నప్పుడల్లా మోడీకి దగ్గర అవుతూనే ఉన్నారు. కార్పొరేట్ రిలేషన్స్ సాయంతో.. కొడుకు రామ్ చరణ్‌కు నేషనల్, ఇంటర్నేషనల్ గ్లామర్ తెచ్చేందుకు పథకం ప్రకారం వెళ్తున్నారు చిరంజీవి. ఇటీవల చిరంజీవికి పద్మ విభూషణ్‌ రావడం వెనక కూడా పవన్ కళ్యాణ్ కృషి ఉందనే చర్చ బాగా జరిగింది. చంద్రబాబుతో వ్యక్తిగతంగా అంత సఖ్యత లేకపోయినప్పటికీ.. కేంద్రంలో మోడీతో సంబంధాలు, రాష్ట్రంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో దిగడంతో చిరంజీవి తన రాజకీయ ముసుగు తీయక తప్పలేదు. మొదట బీజేపీ నేత సీఎం రమేష్, జనసేన నేత పంచకర్ల రమేష్‌లకు ఓటు వేయాలని కోరుతూ వీడియో రిలీజ్ చేశారు చిరంజీవి.

ఇప్పుడు కంకిపాడు బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్‌కు ఓటేసి గెలిపించాలంటూ మరో వీడియో రిలీజ్ చేశారు. రేపోమాపో పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ కోసం చిరంజీవి ఎన్నికల ప్రచారానికి వస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఇప్పటివరకు గోడ మీదే ఉన్న చిరంజీవి.. గోడ దూకి తన ముసుగు తీసేశారు. చిరంజీవికి వ్యతిరేకంగా టీడీపీ కమ్మలాబీ ఎలాంటి దుష్ప్రచారం చేసిందో.. అలాగే 2019లో పవన్ కళ్యాణ్‌కి వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఎంత అల్లరి చేశారో.. ఇవన్నీ మర్చిపోయి, పక్కనపెట్టి కూటమిని గెలిపించే పనిలో పడ్డారు చిరంజీవి. అయితే ఇది ఎక్కడితో ఆగిపోతుందా.. మళ్లీ బీజేపీ ద్వారానో, ఎన్డీఏ కూటమి ద్వారానో.. రాజ్యసభ సీటు సంపాదిస్తారా లేదా అనేది చూడాలి. ఏపీలో ఎన్డీఏ విజయం సాధించవచ్చని ప్రచారం బాగా జరుగుతుండడంతో టీడీపీ, జనసేన, బీజేపీకి ఎన్నికల ప్రచారం చేయడానికి చిరంజీవి వెనకాడడం లేదు. ఒకవేళ పార్టీలు ఓడిపోతాయనే డౌట్ వస్తే.. చిరు ఇంటి గడప దాటేవారు కాదేమో ! అవకాశవాదానికి మంచితనం అని పేరు పెట్టి సినిమా ఇండస్ట్రీలో ఇన్నాళ్లు జాగ్రత్తగా బండి నడుపుకొచ్చిన చిరు.. అదే టెక్నిక్ ఇప్పుడు రాజకీయాల్లో కూడా ప్రదర్శిస్తున్నారు.