తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి.. దయనీయంగా మారింది. నేతలు.. ఎప్పుడు ఎవరు జంప్ అవుతారో అర్థం కాని పరిస్థితి. ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్‌లోకి క్యూ కడుతుంటే.. రాజ్యసభ ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలవని పరిస్థితి.. ఉన్న రాజ్యసభ ఎంపీలు ఉంటారా లేదో తెలియని అయోమయం.. కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేల వలసలకు అడ్డుకట్ట వేయలేక చేతులెత్తేసిన వైనం.. ఇవన్నీ ఒకెత్తు అంటే కవిత జైలు ఎపిసోడ్ మరో ఎత్తు. నాలుగు నెలలు దాటింది తీహార్‌కు వెళ్లి! బెయిల్ వస్తుందో రాదో కూడా అర్థం కావడం లేదు.
ఇలాంటి పరిణామాల మధ్య పార్టీ బతకాలన్నా.. అనుకున్నది అనుకున్నట్లు జరగాలన్నా.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఒక్కటే మార్గం. ఆ దిశగా నడుస్తున్నారే చర్చ జరుగుతోంది. విలీనానికి సంబంధించి వేగంగా అడుగులు పడుతున్నాయని టాక్. ఈ మధ్యే కేటీఆర్, హరీష్ ఢిల్లీ వెళ్లి వచ్చారు. బీజేపీలో కీలకంగా ఉన్న ఓ ఆర్ఎస్ఎస్ నేతలతో.. విలీనానికి సంబంధించి ఈ ఇద్దరు చర్చలు జరిపారని.. తర్వాత ఏం చేద్దాం అనే దానిపై సుధీర్ఘంగా డిస్కస్ చేశారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ విలీనం జరిగితే బీఆర్ఎస్ నేతలకు, ఎమ్మెల్యేలకు కల్పించాల్సిన ప్రాధాన్యతలపై కూడా చర్చకు వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఈ ప్రచారం ఇప్పుడు రెండు పార్టీలను షేక్ చేస్తోంది. విలీనంపై.. అట బీఆర్ఎస్, ఇటు బీజేపీ నేతల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోందని తెలుస్తోంది.
బీజేపీకి చెందిన ముగ్గురు ఎంపీలు.. బీఆర్ఎస్‌ను కలుపుకునేది లేదని తెగేసి చెప్తున్నారట. పార్టీ పెద్దలకు ఇదే సందేశం పంపించేందుకు రెడీ అవుతున్నారట. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలంతా.. విలీనం అంటేనే భగ్గుమంటున్నారట. విలీనం వల్ల బీజేపీ లాభం తప్ప.. బీఆర్ఎస్‌కు ప్రమాదం అని తెగేసి చెప్తున్నారు. గ్రౌండ్ లెవల్‌లో పార్టీ మూలాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందని కారు పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నేతలు వార్నింగ్ ఇస్తున్నారని తెలుస్తోంది. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని స్ట్రాంగ్‌గా ఖండిస్తున్నారు. విలీనం అంటూ రచ్చ జరుగుతున్న వేళ.. మరో కొత్త ప్రచారం తెరమీదకు వచ్చింది.
కేసీఆర్‌కు రాజ్యసభ సీటు ఇచ్చి.. మోదీ కేబినెట్‌లో చేర్చుకుంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. కేటీఆర్, హరీష్‌లో ఒకరు.. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉంటారని అంటున్నారు. ఐతే సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై బీఆర్ఎస్ వర్గాలు సీరియస్ అవుతున్నాయ్. మరి ఇది నిజమా.. నిజం అవుతుందా అంటే.. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు మరి అంటూ కామెంట్లు పెడుతున్నారు మరికొందరు నెటిజన్లు.