Rain Alert: తెలుగు రాష్ట్రాలకు 3రోజులు వర్షసూచన

ఉత్తరాదిని వర్షాలు భయపెడుతుంటే.. దక్షిణాదిలో వరుణుడి కరుణ కనిపించడం లేదు. నిజానికి రుతుపవనాల ప్రభావం ముందుగా దక్షిణాది రాష్ట్రాల్లో కనిపించాలి. ఆ తర్వాత ఉత్తరాదిలో వర్షాలు కురవాలి. ఈసారి మాత్రం అంతా రివర్స్‌. ఉత్తరాది రాష్ట్రాలను భయపెడుతున్న వరుణుడు.. దక్షిణాది వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.

  • Written By:
  • Publish Date - July 17, 2023 / 05:10 PM IST

వర్షాకాలం వచ్చి నెలన్నర దాటిపోతున్నా.. ఇంతవరకూ తెలుగు రాష్ట్రాల్లో వానలు పెద్దగా కురవలేదు. అప్పుడప్పుడూ మాత్రమే, అది కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వర్షాలు పడుతున్నాయ్. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రానున్న మూడురోజులు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఉందని అంటోంది. బంగాళాఖాతంలో ఇప్పటికే ఒక ఆవర్తనం ఏర్పడగా.. 18న మరో ఆవర్తనం ఏర్పడబోతోంది. దీంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని అంటున్నారు. తెలంగాణలో 4 రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

కొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. మెదక్, కామారెడ్డి, మంచిర్యాల, ములుగు, కామారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, నిజామాబాద్, సంగారెడ్డి, కుమరంభీమ్ ఆసిఫాబాద్, వికారాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కి కూడా వర్ష సూచన ఉంది. ఏపీకి సంబంధించి వాతావరణ అధికారుల అంచనాలు తప్పుతున్నాయి. వర్షాలు అనుకున్న స్థాయిలో కురవట్లేదు. వాతావరణంలో వేడి ఎక్కువగా ఉంది. తేమ పెద్దగా లేకపోవడం వల్లే ఈ పరిస్థితి. ఈ ఆవర్తనాల వల్ల వర్షాలు కురిస్తే… రైతులకు మేలు జరుగుతుంది. ఇక అటు వరుణుడి రాక కోసం రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలాచోట్ల విత్తనాలు వేసి.. వర్షపు చినుకుల కోసం ఆకాశం వైపు దీనంగా చూస్తున్న పరిస్థితి. మరి అంచనాలను నిజం అవుతాయే లేదో..