బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయ్. అది వేగంగా కదులుతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ప్రస్తుతం ఒడిశా, విశాఖకు దగ్గరలో ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మూడు రోజులు వర్ష సూచన ఉందని అధికారులు చెబుతున్నారు. ఏపీలో వాతావరణం క్రమంగా మారుతోంది.. మళ్లీ ఆకాశం మేఘావృతం అవుతోంది. అల్పపీడనం ప్రభావం మంగళ, బుధవారాల నుంచి కనిపిస్తుంది. అలాగే ఈ అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలపై భారీగా ఉండబోతోంది. సోమవారం ఆ ప్రాంతాల్లో చిరు జల్లులు కురిసే అవకాశం ఉంది.
రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అల్పపీడనం మయన్మార్ వైపు నుంచి.. ఏపీ వైపుగా కదులుతోంది. ఏపీ వైపు వస్తే భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఏపీలోని పలు జిల్లాల్లో చిరుజల్లుల నుంచి తేలికపాటి వానలు పడతాయంటున్నారు. ఆదివారం వర్షాలు కాస్త తగ్గముఖం పట్టినా సోమవారం నుంచి తేలికపాటి జల్లులు కురుస్తాయంటున్నారు. తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావణశాఖ అంచనా వేస్తోంది. మంగళవారం కుండపోత ఖాయం అని అంటున్నారు. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో భారీగా వానలు పడతాయని అంచనా వేస్తున్నారు.