Rain Effect: తెలుగు రాష్ట్రాలకు చల్లని కబురు

మృగశిర కార్తెలో రాళ్లు మెత్తబడతాయనే సామెత ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ! వర్షాలు ఆ లెవల్‌లో కురుస్తాయని అర్థం. ఐతే ఈసారి మాత్రం భిన్నంగా ఉంది పరిస్థితి.

  • Written By:
  • Publish Date - June 13, 2023 / 04:41 PM IST

తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఎండలు దంచికొడుతున్నాయ్. ఎండలకు తోడు వడగాడ్పులు.. పై ప్రాణాలను పైనే తీసేస్తున్నాయ్. ఒక్క చినుకు దేవుడా అని జనాలు ఎదురుచూస్తున్న పరిస్థితి. రుతుపవనాల ఆలస్యం.. వ్యవసాయం మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉండడంతో.. రైతుల్లోనూ టెన్షన్ మొదలైంది.
బయటకు వెళ్తే వడగాడ్పులు, ఇంట్లో ఉంటే ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. మృగశిర కార్తె ఎంటర్ అయి వారం కావొస్తున్నా.. వాన జాడ కూడా కనిపించడం లేదు.

నైరుతి కేరళలోకి వచ్చాయన్న వార్త సంతోషం కలిగిస్తున్నా.. మన దగ్గరికి ఎప్పుడు అని జనాలు ఎదురుచూస్తున్న పరిస్థితి. ఐతే తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రానున్న మూడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లో జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. ఏపీవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షం కురిసే సూచనలు ఉన్నాయని అంచనా వేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందన్న వాతావరణ శాఖ.. రాయలసీమ ప్రాంతంలో వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం ఏర్పడే చాన్స్ ఉందని తెలిపింది.

తెలంగాణలోనూ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ దిక్కు నుంచే వీచే గాలులు తెలంగాణ మీదుగా తక్కువ ఎత్తులో వీస్తున్నట్లు అధికారులు చెప్పారు. రాబోయే మూడు రోజులపాటు తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించారు. రాష్ట్రంలో కొన్ని చోట్ల మెరుపులతో కూడిన వర్షం కురిసే సూచనలు ఉన్నాయని.. ఆదిలాబాద్‌, ఖమ్మం, ములుగు, కొమరం భీం, మంచిర్యాల, కొత్తగూడెం, సూర్యాపేట, భూపాలపల్లి జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని చెప్తున్నారు.