Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్ప పీడనం.. ఊహించడానికే భయంకరంగా ఉందే..

నాలుగు రోజులు అయింది సూర్యుడు కనిపించి. ఆకాశానికి చిల్లు పడిందా.. ఆ చిల్లు లోంచి నీరు కారుతుందా అనే రేంజ్‌లో వర్షాలు కురుస్తున్నాయి. నాన్‌స్టాప్ ముసురు చిరాకు తెప్పిస్తోంది జనాలకు. కరువు తీరేలా పడ్తున్నాయి వర్షాలు. అక్కడ ఇక్కడ అని తేడా లేదు.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతీ మూలలో ఇదే సీన్.

  • Written By:
  • Publish Date - July 22, 2023 / 03:30 PM IST

భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. మిగతా చోట్ల సంగతి ఎలా ఉన్నా.. హైదరాబాద్‌ను వాన భయపెడుతోంది. చినుకు పడితేనే వణికిపోయే భాగ్యనగరం.. భారీ వానలకు అల్లాడుతోంది. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ.. మరో బాంబ్ పేల్చింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పింది.

దక్షిణ ఒడిశా – ఉత్తర ఆంధ్రా సమీపంలోని వాయువ్య బంగాళాఖాతం, పరిసరాల్లోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 24న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో తెలంగాణలోని చాలా చోట్ల ఈ నెల 24వ తేదీ నుంచి 3, 4 రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు.

ఇక భారీ వర్షాల కారణంగా హైదరాబాద్‌ జంట జలాశయాల్లో నీటిమట్టం పెరుగుతోంది. హిమాయత్‌ సాగర్‌కు 3000 క్యూసెక్కులు, ఉస్మాన్ సాగర్‌కు 4000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. ఇక అటు హుస్సేన్ సాగర్ కూడా భయపెడుతోంది. గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయబోతున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాల్లో భయం భయం గా గడుపుతున్నారు జనాలు