Rain Alert To Telangana: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక

వరుణుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. తెలుగు రాష్ట్రాల్లో దంచికొడుతున్నాడు. దీంతో రెండు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణకు భారీ వాన గండం పొంచి ఉందని అధికారులు అంటున్నారు.

  • Written By:
  • Publish Date - July 25, 2023 / 02:16 PM IST

తెలంగాణకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు.. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి పరిస్థితి మరింత భయంకరంగా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. తెలంగాణలోని తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే హైదరాబాద్‌తో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆ తర్వాత ఉపరితల ఆవర్తనం వాయువ్య దిశగా పయనించే అవకాశం ఉంది. జూలై 28 తర్వాత నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే చాన్స్ ఉంది.

దక్షిణ ఒడిశాతో పాటు ఉత్తరాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావం ఉత్తరాంధ్ర జిల్లాలపై భారీగా పడే చాన్స్ ఉంది. ఏపీతో పాటు యానాంలోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉంది. కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఇవాళ, రేపు అతి భారీ వర్షాలు కురుస్తాయ్. దీంతో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక జారీ చేసింది. అవసరం ఉంటే తప్ప ఇంటి నుంచి అడుగు బయటపెట్టొద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇక అటు భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయ్. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయ్.