ఒక రాజకీయ నాయకుడికి.. అందులోను మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి అన్నిటి కంటే ఎక్కువ ఉండాల్సింది ఓపిక. మంత్రులు వస్తున్నారంటే కార్యకర్తలు, కింది స్థాయి నాయకుల్లో ఉండే ఉత్సాహం, ఆరాటం వేరేగా ఉంటుంది. దాన్ని అర్థం చేసుకుని కార్యక్రమాన్ని నడిపించుకోవాలి కానీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించకూడదు. కానీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బైంస మార్కెట్ కమిటీ చైర్మన్‌తో ప్రవర్తించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో స్టీల్ బ్రిడ్జ్ ఓపెనింగ్‌కు మంత్రి కేటీఆర్ వచ్చారు.
అదే కార్యక్రమానికి బీఆర్‌ఎస్ మంత్రులు, స్థానిక నేతలతో పాటు బైంసా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ కూడా వచ్చారు. కేటీఆర్ పక్కనే నడుస్తూ వెళ్తున్న రాజేష్‌ను ఒక్కసారిగా తలసాని వెనక్కి లాగారు. కాలర్ పట్టుకుని చెంపమీద కొట్టారు. ఒక పదవిలో ఉన్న వ్యక్తి అని కూడా చూడకుండా దురుసుగా ప్రవర్తించారు. ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. కేటీఆర్ పక్కన మంత్రులు మాత్రమే నడవాలా.. వేరే వాళ్లు నడిస్తే తప్పేంటి. అభిమానంతో పక్కన నడిస్తే కొట్టేస్తారా. మీ పార్టీని స్థానికంగా బలోపేతం చేసేందుకు నాయకులు కావాలి.. కానీ వాళ్లు మీ పక్కన నడిస్తే మాత్రం తట్టుకోలేరా అంటున్నారు ఈ వీడియో చూసిన పబ్లిక్.