Kadiyam Srihari: కాంగ్రెస్‌లో అపుడే కుమ్ములాటలు మొదలయ్యాయని, 2028లో అధికారం మళ్లీ బీఆర్ఎస్‌దే అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. గురువారం.. మహబూబాబాద్ పార్లమెంట్ స్థానంపై జరిగిన సమీక్షా సమావేశంలో కడియం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ”1978 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో రకరకాల రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తెచ్చినా 1989లో ఓడిపోయారు. మళ్ళీ 1994లో కాంగ్రెస్‌ను ప్రతిపక్ష హోదా దక్కకుండా ఓడించారు.
AP Elections : పట్టణాల్లో ఫ్యాన్ కి ఎదురుగాలి.. జగన్ భయం అందుకేనా ?
రాష్ట్రంలో ఇప్పుడు కూడా ప్రజలు మార్పు కోరుకున్నారు. రాజకీయాల్లో ఇది సహజం. ఓటమి గురించి ఎక్కువ భాధ పడాల్సిన అవసరం లేదు. భవిష్యత్ మనదే. 2028లో అధికారం బీఆర్ఎస్‌దే. కాంగ్రెస్‌లో అపుడే కుమ్ములాటలు మొదలయ్యాయి. పొంగులేటి తానే నెంబర్ 2 అంటున్నారు. భట్టికి సీఎం పదవి రాలేదని ఆయన భార్య వాపోతున్నారు. కాంగ్రెస్‌లో ఎవరికి వారే యమునా తీరే. కాంగ్రెస్ 420 హామీలు నెరవేర్చే పరిస్థితి ఉండదు. కేటీఆర్, హరీష్ రావులు కృష్ణార్జునులు. వారు కలిసికట్టుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి. కార్యకర్తలకు అగ్రనాయకత్వం అందుబాటులో ఉండాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుపై స్పష్టత లేదు. దళిత బంధు కింద కేసీఆర్ పది లక్షలు ఇస్తే.. దాన్ని పన్నెండు లక్షల రూపాయలకు పెంచుతామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. గతంలో ఎంపికైన దళిత బంధు లబ్దిదారులకు సాయాన్ని ఆపాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం దుర్మార్గం. దళితులతో రాజకీయ చెలగాటం తగదు. మహబూబాబాద్‌లో కష్టపడి పనిచేసి పార్లమెంటు స్థానాన్ని కైవసం చేసుకుందాం” అని కడియం వ్యాఖ్యానించారు.
TDP first list is ready : టీడీపీ ఫస్ట్ లిస్ట్ రెడీ ! ఆ పాతికమందికి గ్యారంటీ !
మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కూడా ఈ సమావేశంలో మాట్లాడారు. “భారీగా హాజరైన ఈ కార్యకర్తలను చూస్తుంటే మనం ఓడిపోలేదనిపిస్తోంది. దళిత బంధుపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నాయకులమంతా కలిసికట్టుగా నిలదీద్దాం. అసెంబ్లీ ఎన్నికల ఓటమిని మరచిపోయి పార్లమెంటు ఎన్నికల్లో గట్టిగా పని చేసి గెలుద్దాం. గిరిజనుల్లో ఉన్న కొన్ని అపోహలు తొలగించి తిరిగి వారి మద్దతు బీఆర్ఎస్‌కు కూడగట్టేలా ప్రయత్నం జరగాలి” అని అభిప్రాయపడ్డారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ మాట్లాడుతూ.. “అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నేతలు కూడా అనుకోలేదు. కొన్ని చిన్న చిన్న పొరపాట్లతో బీఆర్ఎస్ ఓడిపోయింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి సురక్షిత మంచినీరు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే. పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత కూడా కేసీఆర్ సర్కార్‌దే. మనం చేసినవి సరిగా చెప్పలేకపోయాం. జరిగిందేదో జరిగింది. ఇక పార్లమెంటు ఎన్నికలపై ద్రుష్టి సారిద్దాం. నేతలంతా సమన్వయంతో పని చేసి మహబూబాబాద్‌లో బీఆర్ఎస్‌ను గెలిపిద్దాం” అని వ్యాఖ్యానించారు.