బీఆర్ఎస్కు ఆ పార్టీ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ వైఎస్ చైర్మెన్ బాలాజీసింగ్ కూడా కారు పార్టీకి బైబై చెప్పేశారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి.. ఇప్పటికే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ టిక్కెట్టును ఆశించారు కసిరెడ్డి. ఐతే సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కే కేసీఆర్ టికెట్ కేటాయించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేకే కేసీఆర్ టికెట్ కేటాయించడంతో.. కసిరెడ్డి హర్ట్ అయ్యారు. దీంతో పార్టీ జంప్ చేశారు. కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, కసిరెడ్డి నారాయణరెడ్డి మధ్య చాలాకాలంగా విభేదాలు ఉన్నాయ్.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుంచి నారాయణరెడ్డి పోటీ చేయాలని భావించినా.. అది కుదరలేదు. ఆ సమయంలో బీఆర్‌ఎస్ అధిష్ఠానం నారాయణరెడ్డికి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నారాయణరెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఐతే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా అవకాశం రాకపోవడంతో కాంగ్రెస్ వైపు చేరబోతున్నారు. హస్తం పార్టీలో చేరి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డిని పోటీకి దింపేందుకు కాంగ్రెస్ అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు సమాచారం. టికెట్ కన్ఫర్మ్ కావడంతో నారాయణరెడ్డి రేవంత్‌తో భేటీ అయ్యారని, త్వరలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.