పాడి కౌశిక్ రెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. నిత్యం ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఎదుటివాళ్లు ఎవరు.. వాళ్ల హోదా ఏంటి.. అనే విషయాలు ఏమాత్రం పట్టించుకోకుండా నోటికి పని చెప్తూ ఉంటారు. ఇబ్బందులు కొని తెచ్చుకుంటూ ఉంటారు. తాజాగా గవర్నర్ తమిళి సై పై చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపాయి. దీంతో జాతీయ మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరవ్వాల్సి వచ్చింది. మరోవైపు తన కారుకు 13 పెండింగ్ చలాన్లు ఉన్నాయి. అన్నీ ఓవర్ స్పీడ్ కు సంబంధించినవే.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జరిగిన ఓ సమావేశంలో గవర్నర్ తమిళి సైపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. చట్టసభలు ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ తన వద్దే ఉంచుకున్నారంటూ అసభ్య పదజాలం ఉపయోగించారు. దీన్ని సీరియస్ గా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్.. కౌశిక్ రెడ్డి మాటలను సుమోటోగా స్వీకరించింది. నోటీసులు పంపించి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో కౌశిక్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు.
ఇదే సమయంలో కౌశిక్ రెడ్డి కారు చలాన్లు బయటికొచ్చాయి. ఆయన కారుకు 14 చలాన్లు ఉన్నట్టు గుర్తించారు. ఇందులో 13 చలాన్లు ఓవర్ స్పీడ్ కు సంబంధించినవే ఉన్నాయి. 12వేలకు పైగా జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఓవర్ స్పీడ్, స్టాప్ లైన క్రాసింగ్, రాంగ్ పార్కింగ్.. లాంటి అనేక అంశాలపై చలాన్లు వేశారు పోలీసులు.
సాధారణంగా ప్రజాప్రతినిధి ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. పది మందికీ పనికొచ్చే పనులు చేయాలి. తనను అనుసరించే వారికి స్ఫూర్తిప్రదాతగా ఉండాలి. మాట, నడవడిక మంచిదైతే తనతో పాటు ఉండేవాళ్లు కూడా వాటిని అనుసరిస్తారు. కానీ పాడి కౌశిక్ రెడ్డి తీరు మాత్రం సెపరేటు. తను ఏది మాట్లాడినా.. ఏం చేసినా అది వివాదమే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి అతని తీరే అంత. నోరు పారేసుకోవడం, మళ్లీ దాన్ని సమర్థించుకోవడం.. ఇబ్బందులు కొని తెచ్చుకోవడం కౌశిక్ రెడ్డికి కామన్ అయిపోయింది. తాను చేసేది తప్పు అనే ఫీలింగ్ అసలే ఉండదు. తప్పు చేస్తే ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వస్తుందనే భయమూ లేదు. పాలిటిక్స్ లో తనొక రామ్ గోపాల్ వర్మ టైపు. వర్మ లాగే ఏది పడితే అది వాగి పరువు పోగొట్టుకుంటూ ఉంటారు.
కౌశిక రెడ్డి తీరుపై అధినేత కేసీఆర్ కూడా విసిగిపోయినట్లు సమాచారం. ఇలాగే కొనసాగితే త్వరలోనే కౌశిక్ రెడ్డిపై యాక్షన్ తీసుకునేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. కనీసం అప్పుడైనా కౌశిక్ రెడ్డి మారుతారేమో చూడాలి.