ఆసీస్ టూర్ కూ షమీ డౌటే క్లారిటీ లేదన్న రోహిత్ శర్మ

భారత్ జట్టు ఇక వరుస టెస్ట్ సిరీస్ లతో బిజీగా గడపపోతోంది. బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్ ముగిసిన నాలుగురోజులకే కివీస్ తో టెస్ట్ సిరీస్ కు రెడీ అయింది. ఇటీవల ప్రకటించిన జట్టులో పెద్దగా మార్పులు జరగలేదు. బంగ్లాదేశ్ పై ఆడిన జట్టునే సెలక్టర్లు కొనసాగించారు.

  • Written By:
  • Publish Date - October 15, 2024 / 06:23 PM IST

భారత్ జట్టు ఇక వరుస టెస్ట్ సిరీస్ లతో బిజీగా గడపపోతోంది. బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్ ముగిసిన నాలుగురోజులకే కివీస్ తో టెస్ట్ సిరీస్ కు రెడీ అయింది. ఇటీవల ప్రకటించిన జట్టులో పెద్దగా మార్పులు జరగలేదు. బంగ్లాదేశ్ పై ఆడిన జట్టునే సెలక్టర్లు కొనసాగించారు. దీంతో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ గాయంపై మళ్ళీ అనుమానాలు మొదలయ్యాయి. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన కామెంట్స్ తో షమీ ఆసీస్ టూర్ కూ అందుబాటులో ఉండడంపైనా సందిగ్ధత నెలకొంది. కివీస్ తో తొలి టెస్ట్ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో రోహిత్… షమీ ఫిట్ నెస్ పై స్పందించాడు. ఆసీస్ తో టూర్ కు షమీ అందుబాటులో ఉండడంపై ఇప్పడే ఏం చెప్పలేమని రోహిత్ వ్యాఖ్యానించాడు. అతను 100 శాతం ఫిట్ గా ఉంటేనే ఆడిస్తామని, అనవసరం రిస్క్ తీసుకోలేమని తేల్చేశాడు.

ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో షమీ కోలుకుంటున్నాడని, ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడని చెప్పాడు. అయితే ఎన్సీఎ అతని ఫిట్ నెస్ పై క్లియరెన్స్ ఇస్తేనే జట్టులోకి వస్తాడని రోహిత్ స్పష్టం చేశాడు. త్వరగా ఆడించాలన్న తొందరలో అనవసరంగా షమీపై ఒత్తిడి పెంచలేమని రోహిత్ చెప్పుకొచ్చాడు. న్యూజిలాండ్ తో సిరీస్ ముగిసిన తర్వాతే షమీ పరిస్థితిపై క్లారిటీ వస్తుందన్నాడు. కాగా 2023 వన్డే ప్రపంచకప్ సమయంలోనే మహ్మద్ షమీ గాయపడ్డాడు. అప్పటి నుంచి భారత జట్టుకు దూరమయ్యాడు. తర్వాత BCCI మెడికల్ టీం పర్యవేక్షణలో ఎన్‌సీఏలో ఉన్న షమీ గత కొన్ని రోజులుగా బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.

మోకాలికి సర్జరీ తర్వాత ఆ గాయం మళ్ళీ తిరగబెట్టిందన్న వార్తలు వచ్చినా షమీ మాత్రం వాటిని కొట్టిపారేశాడు. ఇదిలా ఉంటే న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్ ఆడుతున్న భారత్ తర్వాత ఆసీస్ టూర్ కు వెళుతుంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఐదు మ్యాచ్ ల సిరీస్ ఆడాల్సి ఉంది. గత రెండు పర్యాయాలు టీమిండియానే ఈ ట్రోఫీ గెలవడంతో ఇప్పుడు మళ్ళీ అంచనాలు పెరిగాయి. ఆసీస్ పిచ్ లపై బూమ్రా, సిరాజ్ లతో పాటు షమీ కూడా కీలకమే. అయితే రోహిత్ తాజా వ్యాఖ్యలతో మహ్మద్ షమీ రీఎంట్రీపై సస్పెన్స్ కొనసాగుతోంది.