వీళ్ళపై కాసుల వర్షం, వేలంలో టాప్-10 ప్లేయర్స్ వీళ్ళే

ఐపీఎల్ మెగావేలం ముగిసింది. ఊహించినట్టుగానే మెగావేలంలో ఫ్రాంచైజీలు ఆచితూచి వ్యవహరించాయి. తీసుకోవాలనుకున్న ప్లేయర్స్ కోసం కోట్ల రూపాయలు వెచ్చించిన ఫ్రాంచైజీలు... పలువురు స్టార్ ప్లేయర్స్ తక్కువ ధరకే వచ్చినా పట్టించుకోలేదు. పక్కా ప్లాన్ తోనే వేలంలో పాల్గొని కీలక ఆటగాళ్ళను సొంతం చేసుకున్నాయి.

  • Written By:
  • Publish Date - November 26, 2024 / 06:35 PM IST

ఐపీఎల్ మెగావేలం ముగిసింది. ఊహించినట్టుగానే మెగావేలంలో ఫ్రాంచైజీలు ఆచితూచి వ్యవహరించాయి. తీసుకోవాలనుకున్న ప్లేయర్స్ కోసం కోట్ల రూపాయలు వెచ్చించిన ఫ్రాంచైజీలు… పలువురు స్టార్ ప్లేయర్స్ తక్కువ ధరకే వచ్చినా పట్టించుకోలేదు. పక్కా ప్లాన్ తోనే వేలంలో పాల్గొని కీలక ఆటగాళ్ళను సొంతం చేసుకున్నాయి. ఓవరాల్ గా 182 మంది కోసం 639.15 కోట్లు వెచ్చించాయి. ఈ క్రమంలో అంచనాలకు తగ్గట్టుగానే పలువురు స్టార్ ప్లేయర్స్ సరికొత్త రికార్డులు నెలకొల్పారు. లీగ్ చరిత్రలోనే ఈ సారి అత్యధిక బిడ్డింగ్స్ నమోదయ్యాయి. టాప్ 10 జాబితాను చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ రిషబ్ పంత్ కోసం ఫ్రాంచైజీలు హోరాహోరీగా తలపడ్డాయి. చివరకు లక్నో సూపర్ జెయింట్స్ ఏకంగా 27 కోట్లకు పంత్ ను కొనుగోలు చేసింది. దీంతో లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఈ యువ వికెట్ కీపర్ రికార్డులకెక్కాడు.

అలాగే కోల్ కత్తా నైట్ రైడర్స్ ను ఛాంపియన్ గా నిలిపిన శ్రేయాస్ అయ్యర్ కూడా భారీ ధర పలికాడు. ఢిల్లీ, కోల్ కత్తా , పంజాబ్ అతని కోసం తలపడగా రేటు పెరుగుతూ పోయింది. చివరకు పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లకు శ్రేయాస్ అయ్యర్ ను దక్కించుకుంది.
శ్రేయాస్ అయ్యర్ తర్వాత అత్యధిక ధర పలికిన ఆటగాడు కూడా కోల్ కత్తా నైట్ రైడర్స్ ప్లేయరే… ఈ ఆల్ రౌండర్ కోసం కోల్ కత్తా 23.75 కోట్లు వెచ్చించింది. అలాగే పలువురు బౌలర్లు కూడా ఈ సారి వేలంలో జాక్ పాట్ కొట్టారు. వేలంలో తొలి ప్లేయర్ గా వచ్చిన అర్షదీప్ సింగ్ కోసం ఫ్రాంచైజీలు గట్టిగానే తలపడ్డాయి. ఆరంభ ఓవర్లతో పాటు డెత్ ఓవర్స్ లో అద్భుతంగా బౌలింగ్ చేసే అర్షదీప్ కోసం కోట్లు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో 18 కోట్లకు ఆర్టీఎం ద్వారా మళ్ళీ పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ అతన్ని తిరిగి తీసుకుంది. ఇక వేలంలో అందరినీ ఆశ్చర్యపరిచిన బిడ్డింగ్ ఏదైనా ఉందంటే అది స్పిన్నర్ చాహల్ దే… రాజస్థాన్ రాయల్స్ కు ఆడుతున్న యజ్వేంద్ర చాహల్ కోసం పంజాబ్ ఏకంగా 18 కోట్లు వెచ్చించింది. దీంతో లీగ్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన స్పిన్నర్ గా చాహల్ రికార్డులకెక్కాడు.

ఇదిలా ఉంటే చాహల్ తర్వాత వేలంలో అత్యధిక ధర ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ జాస్ బట్లర్ కు దక్కింది. బట్లర్ ను 15.75 కోట్లకు గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. గత సీజన్ లోనూ అంతకుముందు కూడా ఈ ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ పరుగుల వరద పారించాడు. అటు లక్నో ఫ్రాంచైజీతో విభేదించి వేలంలోకి వచ్చిన కేఎల్ రాహుల్ 14 కోట్లకు అమ్ముడయ్యాడు. రాహుల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ 14 కోట్లకు దక్కించుకుంది. టాప్ 10 జాబితాలో రాహుల్ తర్వాత కివీస్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ కు అత్యధిక బిడ్ వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్ తో పాటు ఐపీఎల్ లోనూ మంచి రికార్డున్న బౌల్ట్ ను ముంబై ఇండియన్స్ 12.5 కోట్లు వెచ్చించి వెనక్కి తీసుకుంది. ఇక ఆస్ట్రేలియన్ పేసర్ హ్యాజిల్ వుడ్ కూడా మంచి ధరే పలికాడు. హ్యాజిల్ వుడ్ ను 12.5 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది. డెత్ ఓవర్స్ లో అతనికి మంచి రికార్డు ఉండడమే దీనికి కారణం. కాగా చివరి నిమిషంలో వేలంలో పేరు నమోదు చేసుకున్న జోఫ్రా ఆర్చర్ కు కూడా మంచి ధరే పలికింది. ఆర్చర్ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగానే పోటీపడగా.. చివరకు రాజస్థాన్ రాయల్స్ 12.5 కోట్లకు ఈ ఇంగ్లాండ్ పేసర్ ను తీసుకుంది.