Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు..

ఎండలతో విసిగిపోయిన తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అధికారులు చల్లటి వార్త చెప్పారు. కాస్త ఆలస్యం అయినప్పటికీ ఈ నెల 21న తెలంగాణకు రుతుపవనాలు రాబోతున్నాయని చెప్పారు.

  • Written By:
  • Publish Date - June 20, 2023 / 05:51 PM IST

నిజానికి ఇప్పటికే రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి ఉండాలి. కానీ బిపర్‌జోయ్‌ తుఫాను కారణంగా ఈ సంవత్సరం రుతుపవనాల రాక ఆలస్యమైంది. దీంతో ఇంతకాలం ఊరించిన రుతుపవనాలు ఇప్పుడు రాష్ట్ర ప్రజలను చల్లబర్చనున్నాయి. ఇవాళ వాతావరణం వేడిగానే ఉన్నా రేపు మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడుతుందని చెప్తున్నారు.

ఇక ఈ నెల 25లోపు తెలంగాణలోని అన్ని జిల్లాలో వర్షాపాతం నమోదౌతుందని చెప్తున్నారు. నిజానికి గత కొన్ని రోజులతో కంపేర్‌ చేస్తే నిన్న ఇవాళ తెలంగాణలో ఎండలు కాస్త తగ్గాయి. చాలా జిల్లాల్లో ఆరెంజ్‌ అలెర్ట్‌ తొలగించి ఎల్లో అలెర్ట్‌ జారీ చేశారు వాతావరణశాఖ అధికారులు. ఇక రాయలసీమలో ఇప్పటికే రుతుపవనాలు ప్రవేశించాయి. జూన్‌ పది నుంచే అక్కడ కాస్త వర్షాలు ప్రారంభమైనా.. ఆ తరువాత తుఫాను కారణంగా ఆగిపోయాయి.

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా రుతుపనాలు వ్యాపిస్తాయని అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే రెండు రోజుల నుంచి పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురిశాయి. మీనంబాకంలో ఏకంగా 13.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తమిళనాడులో కూడా వర్షాలు భారీగానే కురుస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా వారం రోజుల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుందని ఐఎండీ అధికారులు చెప్తున్నారు.