ఐతే సభ ప్రారంభమయ్యే ముందు కాంగ్రెస్ నేత సోనియా గాంధీని ప్రధాని మోదీ పలకరించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మణిపుర్ అంశంపై చర్చించాలని మోదీకి సోనియా విజ్ఞప్తి చేశారు. లోక్‌సభ సమావేశాల తొలిరోజు వివిధ పార్టీల సభ్యులు పలుకరించుకోవడం సంప్రదాయం. ఈ సందర్భంగా సభ ప్రారంభానికి ముందు వివిధ పార్టీలకు చెందిన సభ్యులను మోదీ పలకరించారు. ఈ క్రమంలోనే విపక్ష నేతల దగ్గరకు ప్రధాని మోదీ వచ్చారు. కాంగ్రెస్ నేత సోనియా గాంధీని పలకరించారు.
సోనియా, రాహుల్ ప్రయాణిస్తున్న విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడాన్ని ప్రస్తావించిన మోదీ.. ఆ తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలో… సోనియా కూర్చొని ఆక్సిజన్ మాస్క్ ధరించి కనిపించారు. సాంకేతిక లోపం కారణంగా వారి చార్టర్డ్ విమానం భోపాల్‌లో అత్యవసర ల్యాండింగ్ చేయబడింది. జులై 17, 18 తేదీల్లో రెండు రోజులపాటు జరిగిన ప్రతిపక్షాల మెగా సమావేశానికి హాజరైన తర్వాత సోనియా గాంధీ బెంగళూరు నుంచి ఢిల్లీకి వెళ్తున్నారు. సాంకేతిక సమస్య పరిష్కరించబడిన తరువాత సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు బుధవారం రాత్రి 9:30 గంటలకు ఇండిగో విమానంలో ఢిల్లీకి తమ ప్రయాణాన్ని కొనసాగించారు. దీని గురించే మోదీ ఆరా తీశారు.