Parakala Main Road: అష్టదిగ్బంధంలో మొరంచపల్లి.. జనాల ఆర్తనాదాలు.. రంగంలోకి కేసీఆర్‌..

ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానలు వణుకు పుట్టిస్తున్నాయ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా, పరకాల మెయిన్ రోడ్డు మీద మొరంచపల్లి వాగు పొంగిపొర్లుతుంది. దాదాపు 15ఫీట్ల ఎత్తు నుంచి వరద ప్రవహిస్తోంది.

  • Written By:
  • Publish Date - July 27, 2023 / 02:55 PM IST

వరద ప్రవాహానికి ఊరంతా నీటమునిగింది. దాదాపు వెయ్యి మంది గ్రామస్తులు వరదలో చిక్కుకుపోయారు. బస్టాండ్ ఆవరణలో ఒక పెద్ద బిల్డింగ్ ఉంటే దాని పైకి ఎక్కి వర్షములో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అని గ్రామస్తులు వణికిపోతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, మహిళల పరిస్థితి వర్ణనాతీతంగా ఉంది. చాలామంది సెల్‌ఫోన్లు కూడా పని చేయడం లేదని.. దీంతో అధికారుల సాయం కోరేందుకు కూడా వీలుకావడం లేదని వాపోతున్నారు. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో మొరంచపల్లి గ్రామం అష్టదిగ్బంధంలో చిక్కుకుంది.

భూపాలపల్లి జిల్లాలో మొరంచ వాగు ఉగ్రరూపం దాల్చింది. ఎగువన గణప సముద్రం 3ఫీట్లు మేర మత్తడి పడుతుండం.. ఆ నీరు కూడా మొరంచ వాగులో చేరటంతో ప్రవాహం ఉధృతి మరింత పెరిగింది. దీంతో వరద ముంపుకు గురై మోరంచపల్లి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరద చుట్టేయడంతో మొరంచా వాగులో లారీలు మునిగాయి. భయంతో బిక్కుబిక్కుమంటూ లారీ పైకెక్కి కూర్చున్నారు డ్రైవర్లు. దీంతో వారిని కాపాడేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మొరంచపల్లి వాసులను కాపాడటానికి అధికారులు వెళ్లాలంటే కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది. భూపాలపల్లి నుంచి అధికారులు రావడానికి ఏమాత్రం అవకాశం లేదు.

భూపాలపల్లి మైసమ్మ గుడి వద్ద వాగు ఉధృతి పెరగడంతో పాటు, మోరంచపల్లి వద్ద మోరంచ వాగు ఉధృతితో అధికారులు అక్కడికి చేరుకోవడం కష్టమే. కేవలం హెలికాప్టర్ ద్వారానే ఆ ప్రాంత ప్రజలను కాపాడటానికి అవకాశం ఉంది. గంట గంటకు మోరంచ ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు లోనవుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని తమను కాపాడాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేస్తూ తమను కాపాడాలని ప్రాధేయ పడుతున్నారు. మొరంచపల్లి వరదలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయ్. ఎప్పుడు ఏం జరుగుతుందా అని ఉత్కంఠ రేపుతున్నాయ్. దీంతో సీఎం కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు.

భారీ వరదలపై ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని పరిస్థితిని సీఎస్‌ శాంతికుమారి ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్‌కు వివరిస్తున్నారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మోరంచపల్లిలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్‌ను పంపించాలని కేసీఆర్‌ ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ మిలటరీ అధికారులతో సీఎస్‌ శాంతికుమారి సంప్రదింపులు జరిపారు. సహాయక చర్యల్లో సాధారణ హెలికాప్టర్‌ వినియోగించడం కష్టవుతుండటంతో సైన్యంతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది.