కాపుల చుట్టూ ఏపీ రాజకీయాలు తిరగడం ఈనాటి విషయం కాదు. ఏపీలో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలో నిర్ణయించే సామర్థ్యమున్న ఓటర్లు కాపులకు దశాబ్దాలుగా ఉన్నారు. అధికారంలోకి రావాలంటే కాపుల ఓట్ బ్యాంక్ కీలకం. కాపులు ఎటు వైపు ఉంటే అదే పార్టీ గెలుస్తుందన్న నమ్మకం కూడా ఏనాటి నుంచో ఉంది. 1988లో వంగవీటీ రంగ హత్య అనంతర ఎన్నికలు, 2014 ఎన్నికలు, 2019 ఎన్నికలు ఈ విషయాన్ని కళ్లకు కట్టినట్టు చూపించాయి. ఇటు అధికారాన్ని నిర్ణయించే ఓటర్లున్న కాపులకు ఇప్పటి వరకు రిజర్వేషన్ల విషయంలో న్యాయం జరగలేదన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. మరోవైపు కాపుల నుంచి ఏపీకి ఇప్పటివరకు ఎవరూ సీఎం అవ్వకపోవడం.. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తననే సీఎం చేయండని ఓటర్లను అడుగుతుండడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాపుల ఓట్లే కీలకం కానున్నాయి. అందుకే పవన్ కూడా కాపులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.. ఇటివలే వారాహి యాత్ర ప్రారంభించిన పవన్.. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. ఇలా పవన్ మండిపడడం సాధారణ విషయమే అయినా రియాక్షన్ మాత్రం కాపు ఉద్యమ నేతగా చెప్పుకునే ముద్రగడ్డ పద్మనాభం నుంచి రావడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
ముద్రగడ్డకు ఏంటో నొప్పి..?
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటి చేస్తాయో లేదోనన్నది అటు ఉంచితే వారాహి యాత్రలో పవన్ దూసుకుపోతున్నారు. ఇటివలే కాకినాడలో జరిగిన బహిరంగ సభలో స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. కాపులను అన్యాయం జరిగిందంటూ మండిపడ్డారు. పవన్ వ్యాఖ్యలపై ద్వారంపూడి కౌంటర్ ఇవ్వడం ఊహించిన విషయమే..అయితే ఇక్కడ ముద్రగడ్డ పద్మనాభం ఎందుకు ఎంట్రీ ఇచ్చారన్నది ఆశ్చర్యం. ఔనన్నా కాదన్నా పవన్ కల్యాణ్ మాత్రమే కాపులకు ఇప్పుడు మిగిలిన హోప్. తన వంతు ఏదో కాపులకు మంచి చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ముద్రగడ్డకు ఇది కూడా నచ్చనట్టుంది. పవన్‌పై విషం కక్కుతూ మూడు పేజీల లేఖ రాశారు.
ముద్రగడ్డకు కాకినాడ ఎంపీ టికెట్?:
కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ్డ పోరాడిన మాట వాస్తవమే.. నాడు అధికారంలో ఉన్న టీడీపీ ఈ ఉద్యమాన్ని తొక్కేసిందని.. కాపులకు చెల్లని రిజర్వేషన్లు ఇచ్చి మభ్యపెట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే కావొచ్చు 2019 ఎన్నికల్లో కాపులు వైసీపీ పక్షాన నిలిచారు. ఇదంతా గతం.. ముద్రగడ్డ పోరాటంపై పవన్ వ్యాఖ్యలు చేయలేదు..ముద్రగడ్డని తక్కువ చేసి మాట్లాడలేదు.. కాకినాడ సభలో ముద్రగడ్డ పేరు కూడా పవన్ ఎత్తలేదు. ద్వారంపూడిని మాత్రమే కడిగిపాడేశారు. ద్వారంపూడిని తిడితే వైసీపీ వాళ్లు అమ్మో.. అయ్యో అనాలి కానీ.. మధ్యలో ముద్రగడ్డ ఎందుకు లేఖ రాశారన్నది అర్థంకాలేదు. ముద్రగడ్డకు వైసీపీ నుంచి కాకినాడ తరఫున ఎంపీగా బరిలోకి దింపుతారన్న ప్రచారం చాలా కాలంగా ఉంది. అదే నిజం కావొచ్చు.. అందుకే ముద్రగడ్డ అంతలా రియాక్ట్ అయ్యి ఉండవచ్చు.
ముద్రగడ్డ క్రెడిబిలిటీని కోల్పోయారా?
కాపుల కోసం పోరాడిన వ్యక్తిగా ముద్రడ్డకు మంచి పేరే ఉంది. టీడీపీపై ఆయనకున్న వ్యతిరేకతలో అర్థం ఉండొచ్చు కానీ ఆ కోపం వైసీపీపై ప్రేమగా మారడం మాత్రం కరెక్ట్ కాదు. ఓ కులం సంక్షేమం కోసం.. వాళ్ల అభివృద్ధి కోసం పోరాడడం తప్పు కాదు.. అన్యాయం జరిగిన చోటా కచ్చితంగా నిలదీయాల్సిందే. గతంలో ముద్రగడ్డ అదే చేశారు. ఇప్పుడు పవన్ అదే చేయాలనుకుంటున్నారు. అందుకే తెలివిగా టీడీపీని ఇరుకున పెడుతూ తానే సీఎం అని ప్రకటించుకుంటున్నారు. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కుమారస్వామి పాత్రే పోషించాలని కోరుకుంటున్నారు.
పవన్ సీఎం అయితే అది అల్టిమేట్‌గా కాపులకే లాభం.. కాపులకు కావాల్సిన రిజర్వేషన్లు పవన్ సాధించుకోలడని జనసేన అభిమానులు నమ్ముతున్నారు. అది సాధ్యమో కాదోనన్నది పక్కన పెడితే కాపులకు ఉన్న ఐకైక హోప్ పవన్ మాత్రమే.. ముద్రగడ్డకు ఈ విషయం తెలియనది కాదు.. కానీ ఆయన కాపుల సంక్షేమం కోసం కాకుండా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే పవన్‌కి వ్యతిరేకంగా లేఖ రాసినట్టు స్పష్టమవుతుంది. లేకపోతే ద్వారంపూడిపై పవన్‌ని పోటి చేయమని ముద్రగడ్డ అడగడం ఏంటీ..? ఇందులో ఏమైనా లాజిక్ ఉంది. పవన్ ఎవర్ని తిడితే వాళ్లపై పోటి చేయాలా..? పవన్ రోజూ జగన్‌ని తిడుతుంటారు.. ఈ లాజిక్ ప్రకారం పులివెందులలో జనసేన అధినేత పోటీ చేయాలా..? ద్వారంపూడి కాపుల కోసం ఏదో పొడిచేశాడన్నట్టు ముద్రగడ్డ మాట్లాడుతున్నారు.. ఇంతకీ కాపులకు ద్వారంపూడి ఏం చేశారో ముద్రగడ్డ సెలవివ్వలేదు.. ఇదంతా వైసీపీ ఆడిస్తున్న నాటకం.. కాపుల కోసం ఎంతో పోరాడి,శ్రమించి విసిగిపోయిన ముద్రగడ్డ చివరకు అందరిలాగే జగన్ చెంతకే చేరారు.. ఇది నిజంగా బాధకారం..! ఆ బాధతో కాపులకు కాస్తో కుస్తో మంచి చేయాలని ఆరాటపడుతున్న పవన్ కల్యాణ్‌ని వైసీపీ వాయిస్‌లో నిందించడం ఘోరం.. అది కూడా తనని ఒక్క మాట కూడా అనని జనసేన అధినేతపై లేఖల దాడి చేయడం దారుణం..!