ఈ మధ్య కాలంలో భారత క్రికెటర్ పృథ్వీషా గురించి జరిగినంత చర్చ మరే ఆటగాడి గురించి జరగలేదు. క్రమశిక్షణా రాహిత్యం, ప్రాక్టీస్ కు డుమ్మా, ఫిట్ నెస్ లేకపోవడం… ఒక ఆటగాడిని జట్టులో నుంచి తీసేసేందుకు ఇంతకంటే కారణాలు అక్కర్లేదు.. ప్రస్తుతం పృథ్వీ షా ఈ పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు. ఇటీవల ముంబై సెలక్టర్లు విజయ్ హజారే టోర్నీ కోసం ప్రకటించిన జట్టులో పృథ్వీషాకు చోటు దక్కలేదు. దీంతో సోషల్ మీడియా వేదికగా నేనింకేం చేయాలి దేవుడా అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. తాజాగా ముంబై క్రికెట్ అసోసియేషన్ పృథ్వీ షా పోస్టుకు కౌంటర్ ఇచ్చింది. ఎంసిఎ అధికారి ఒకరు పృథ్వీ షాను జట్టులో నుంచి ఎందుకు తొలగించింది చెప్పుకొచ్చాడు. ఫిట్‌నెస్ లేకపోవడంతోనే పృథ్వీ షాను విజయ్ హజారే ట్రోఫీకి ఎంపిక చేయలేదని సదరు అధికారి ఒకరు స్పష్టం చేశారు. పృథ్వీ షా ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెట్టాలని సూచించారు.
అతన్ని చూస్తేనే ఆటకు పనికిరాడని అందరికీ అర్థమవుతుందని వ్యాఖ్యానించారు.పృథ్వీ షాను విజయ్ హజారే ట్రోఫీకి ఎంపిక చేయకపోవడానికి అతని ఫిట్ నెస్ ప్రధాన కారణమని తేల్చేశారు. అతని ప్రదర్శన కూడా గొప్పగా లేదన్నారు. పృథ్వీ షా ఫిట్‌నెస్ మెరుగుపర్చుకోవడంపై ఫోకస్ పెడుతాడని ఆశిస్తున్నట్టు చెప్పారు. అతని ప్రతిభ గురించి అందరికి తెలిసిందేననీ. తన కెరీర్ ను తానే నాశనం చేసుకుంటున్నాడంటూ అభిప్రాయపడ్డారు. పృథ్వీ షా చేసే హార్డ్ వర్క్‌పై అతని రీఎంట్రీ ఆధారపడి ఉందని సదరు అధికారి స్పష్టం చేశారు. పృథ్వీ షా జట్టులో ఉన్నా లేనట్టేనని, ముంబై 10 మందితోనే ఆడుతుందంటూ వ్యాఖ్యానించారు.
ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టి ఆటను మెరుగుపరుచుకుంటే జట్టులో చోటు దక్కుతుందని, సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఉపయోగం లేదంటూ హితవు పలికారు. గాయాలు, చెడు స్నేహం, క్రమశిక్షణరాహిత్యం అతని కెరీర్‌ను దెబ్బతీసాయి. చివరకు ఐపీఎల్‌లో కూడా అమ్ముడుపోలేదు. రంజీ ట్రోఫీ మధ్యలోనే క్రమశిక్షణా రాహిత్యంతో ముంబై జట్టులో చోటు కోల్పోయాడు. ఇది అతనిపై తీవ్ర ప్రభావం చూపించింది. 6 ఏళ్ల పాటు అతన్ని టీమ్ లో కొనసాగించిన ఢిల్లీ క్యాపిటల్స్ ఇటీవలి మెగా వేలంలో వదిలేయగా.. ఒక్క ఫ్రాంచైజీ కూడా పృథ్వీ షాను తీసుకునేందుకు ఆసక్తి చూపలేదు. 75 లక్షల కనీస ధరకు కూడా పృథ్వీని ఎవ్వరూ కొనుగోలు చేయలేదు.