ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా గుర్తింపు పొందిన ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్…ఏకంగా ఐదుసార్లు టైటిల్ గెలుచుకుంది. సీనియర్లు, జూనియర్ల కూర్పుతో ఎప్పుడూ సక్సెస్ అవుతూ ఉండే ముంబైకి గత సీజన్ లో మాత్రం చుక్కెదురైంది. కెప్టెన్సీ మార్పుతో పేలవ ప్రదర్శన కనబరిచింది. అయితే రిటెన్షన్ లో వ్యూహాత్మకంగా వ్యవహరించిన ముంబై ఇండియన్స్ వేలంలోనూ పక్కా ప్లానింగ్ తో బరిలోకి దిగింది. తమకు కావాల్సిన ఆటగాళ్ళతో చక్కని టీమ్ ను సిద్ధం చేసుకున్నట్టే కనిపిస్తోంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, జస్ప్రీత్ బుమ్రాలను అట్టిపెట్టుకుంది. ముంబై కెప్టెన్‌గా జస్ప్రీత్ బుమ్రాకు అవకాశం ఇవ్వొచ్చంటూ ఊహాగానాలు వెలువడినప్పటికీ హార్ధిక్ పాండ్యానే కొనసాగించారు. ఇక జట్టుని ఏకంగా ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిపిన మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను జట్టులో కొనసాగించారు. ఇక స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను కూడా ముంబై ఫ్రాంచైజీ వదులుకోలేదు.
రిటెన్షన్ కోసం 75 కోట్లు ఖర్చు పెట్టిన ముంబై వేలంలోకి 45 కోట్లతో వచ్చింది. స్టార్ ప్లేయర్ల జోలికి పోకుండా తొలి రోజు సైలెంట్‌గా ఉంది. రెండో రోజు తమకు కావాల్సిన ఆటగాళ్లను మాత్రమే టార్గెట్ చేసి అతి తక్కువ ధరకే మంచి ఆటగాళ్లను కొనుగోలు చేసింది. తాజా వేలంలో ముంబై ఇండియన్స్ అత్యధికంగా ఖర్చు చేసిన ఆటగాళ్లు ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్‌లు మాత్రమే. బౌల్ట్‌ను 12.5 కోట్లకు కొనుగోలు చేసిన ముంబై.. దీపక్ చాహర్ కోసం 9.25 కోట్లు ఖర్చు చేసింది. విల్ జాక్స్‌ను 5.25 కోట్లకు, అల్లా గజన్‌ఫర్‌ను 4.80 కోట్లకు దక్కించుకుంది. అన్ క్యాప్డ్ ప్లేయర్స్ పైనే ముంబై ఇండియన్స్ ఎక్కువగా ఖర్చు చేసింది. నమన్ ధీర్‌ను 5.25 కోట్లకు ఆర్‌టీఎమ్ కార్డ్ ద్వారా తీసుకుంది.
బౌలింగ్ లోనూ ముంబై సాలిడ్ గా తయారైంది. స్టార్ పేసర్ బూమ్రాకు తోడుగా బౌల్ట్ , దీపక్ చాహర్ జట్టులో చేరారు. ఈ పేస్ త్రయాన్ని ఎదుర్కోవడం ప్రత్యర్థి జట్లకు కఠిన సవాలేనని చెప్పొచ్చు. ఓవరాల్ గా బ్యాటింగ్, బౌలింగ్ పరంగా ముంబై ఇండియన్స్ గతంతో పోలిస్తే మరింత పటిష్టంగా మారింది. గత సీజన్ లో పేలవ ప్రదర్శనను మరిచిపోయేలా ఈ సారి అదరగొట్టి టైటిల్ గెలవాలని ముంబై ఇండియన్స్ పట్టుదలగా ఉంది.