నా కొడుకు కెరీర్ దెబ్బతీశారు సంజూ తండ్రి సంచలన వ్యాఖ్యలు

భారత క్రికెట్ లో సంజూ శాంసన్ నైపుణ్యం గురించి అందరికీ తెలిసిందే.. కానీ ఎన్ని అవకాశాలిచ్చినా గతంలో సరిగ్గా వినియోగించుకోలేక వెనుకబడిపోయాడు. అయితే ఇటీవల బంగ్లాదేశ్ తో సిరీస్ దగ్గర నుంచి సంజూ అదరగొడుతున్నాడు.

  • Written By:
  • Publish Date - November 13, 2024 / 08:50 PM IST

భారత క్రికెట్ లో సంజూ శాంసన్ నైపుణ్యం గురించి అందరికీ తెలిసిందే.. కానీ ఎన్ని అవకాశాలిచ్చినా గతంలో సరిగ్గా వినియోగించుకోలేక వెనుకబడిపోయాడు. అయితే ఇటీవల బంగ్లాదేశ్ తో సిరీస్ దగ్గర నుంచి సంజూ అదరగొడుతున్నాడు. హైదరాబాద్ వేదికగా టీ ట్వంటీల్లో తొలి శతకం బాదిన ఈ కేరళ క్రికెటర్ తాజాగా సఫారీ గడ్డపైనా దుమ్మురేపాడు. మరోసారి శతక్కొట్టి తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టాడు. ఈ నేపథ్యంలో సంజూ శాంసన్ తండ్రి శాంసన్ విశ్వనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కొడుకు కెరీర్ నలుగురి వల్ల దెబ్బతిందంటూ వ్యాఖ్యానించాడు. అప్పట్లో అద్భుతంగా ఆడినా కూడా ధోనీ, కోహ్లీ, రోహిత్ , ద్రావిడ్ సంజూకు సరైన అవకాశాలు ఇవ్వలేదని ఆరోపించాడు. తన కొడుకు 10 ఏళ్ల కెరీర్‌ను వాళ్ళు దెబ్బతీశారని మండిపడ్డాడు. అయితే వారి వల్ల సంజూ శాంసన్ మరింత రాటుదేలడం సంతోషంగా ఉందన్నాడు.

ఇదే క్రమంలో మరికొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశాడు. సంజు ఎప్పుడూ కూడా రికార్డుల కోసం ఆడడని చెప్పాడు. కొందరు మాత్రం తమ స్వార్థం కోసం, జట్టులో చోటు కోసం ఆడుతారనీ, కానీ తన కొడుకు మాత్రం అలా కాదన్నాడు. ఇక మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పైనా సంజూ తండ్రి ఫైరయ్యాడు. గతంలో శ్రీకాంత్ పలుసార్లు సంజూ ఆటతీరుపై విమర్శలు గుప్పించాడు. తాజాగా వాటిపై సంజూ తండ్రి తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. తన మాటలతో శ్రీకాంత్ సంజూను తీవ్రంగా బాధపెట్టాడని ఆవేదన వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్ పై సెంచరీ చేస్తే ఎగతాళి చేస్తారా అంటూ ప్రశ్నించాడు. సెంచరీ ఏ టీమ్ పై చేసినా సెంచరీనేనని, ప్రోత్సహించకున్నా పర్వాలేదు కానీ ఎగతాళి చేయొద్దని హితవు పలికాడు.

ఇక గౌతమ్ గంభీర్, సూర్యకుమార్ యాదవ్‌కు సంజూ తండ్రి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ ఇద్దరూ టీ20 జట్టులో లేకుంటే సంజూ శాంసన్‌ను మళ్లీ పక్కనపెట్టేవారన్నాడు. కొందరి వల్ల ఇన్నేళ్లూ సందూకు సరైన అవకాశాలు దక్కలేదనీ, ఇకపై వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆడాలని సూచించాడు. ప్రస్తుతం సంజూ తండ్రి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. సంజూ కెరీర్ ఇప్పుడు సాఫీగా సాగుతుందనుకుంటున్న దశలో ఆయన ఇలా మాట్లాడకూడదంటూ కొందరు అభిప్రాయపడుతున్నారు. కొన్నిసార్లు సంజూ అవకాశాలను వృథా చేసుకున్న విషయాన్ని అతని తండ్రి గుర్తు పెట్టుకుంటే మంచిదంటూ హితవు పలుకుతున్నారు.