Mysterious Red Ring: ఆకాశంలో ఏదైనా వలయాకృతిలో కనిపిస్తే గ్రహాతర వాసులేమో అని అనుమానం కలగడం సాధారణమైపోయింది. వలయాకృతిలో కదులుతూ, మెరుస్తూ కనిపించే వాటిని ఇలా భావిస్తారు. తాజాగా ఇటలీలో ఇలాంటి ఒక వలయాకారం కనిపించి, సంచలనం సృష్టించింది. ఎరుపు రంగులో, ఆకాశంలో కిలోమీటర్ల మేర కనిపించిన ఈ దృశ్యాన్ని చూసి కొందరు గ్రహాంతర వాసుల నౌక అయ్యుండొచ్చని భయపడితే.. ఇంకొందరు మాత్రం ఈ సుందర దృశ్యాన్ని చూసి ఆనందించారు. ఇంతకీ అదేంటి?
360 కిలోమీటర్లు విస్తరించిన వలయం
గత మార్చి 27న సెంట్రల్ ఇటలీలోని ఆల్ఫ్స్ పర్వతాల నుంచి అడ్రియాటిక్ సముద్రం వరకు ఆకాశంలో ఎరుపు రంగులో, వలయాకారంలో ఒక దృశ్యం కనిపించింది. ఇది దాదాపు 360 కిలోమీటర్లు విస్తరించి కనువిందు చేసింది. ఈ ప్రాంతం మొత్తాన్ని ఇది కమ్మేసింది. అయితే, ఇది ఏలియన్స్ వాహనం (సాసర్) అయ్యుండొచ్చని చాలా మంది భావించారు. కొందరు భయాందోళనకు గురయ్యారు. కానీ, ఇది ఏలియన్స్ వాహనం కాదని శాస్త్రవేత్తలు చెప్పారు. కాంతి ఉద్గార క్రమంలో, తక్కువ పౌనపున్యంతో కొన్ని అడ్డంకులు ఏర్పడటం వల్ల ఇలా ఆకాశంలో దర్శనమిస్తుందని సైంటిస్టులు చెప్పారు. వీటిని ఎల్వ్ అంటారు. ఇవి చాలా అరుదుగా ఏర్పడుతుంటాయి.
ఇవి అత్యంత ప్రభావవంతమైన విద్యుదయస్కాంత తరంగాల్ని ఏర్పర్చగలవు. సాధారణంగా ఇవి 10-30 కిలోమీట్ల పరిధిలో ఏర్పడతాయని, కానీ, ఇది మాత్రం పది రెట్లు పెద్దదిగా ఏర్పడిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. సెంట్రల్ ఇటలీకి దాదాపు 285 కిలోమీటర్ల దక్షిణ దిశలో సంభవించిన ఒక తుపాను వల్ల ఇది ఏర్పడి ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు. గతంలో 2017లో కూడా ఇలాంటిదే ఏర్పడిందని స్థానిక ఫొటోగ్రాఫర్ బినోటో చెప్పారు. ఆయన తాజా ఎల్వ్‌ను తన కెమెరాలో బంధించాడు. గతంలో తాను ఇటలీతోపాటు ఫ్రాన్స్, హంగేరి, క్రొయేషియా, ఆస్ట్రియాల్లో వీటిని చూసినట్లు ఆయన చెప్పాడు.