బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదాస్పదం అవుతున్నాయి. కల్కీ సినిమాలో ప్రభాస్ ను జోకర్ అంటూ మాట్లాడటం పట్ల తీవ్ర స్థాయిలో ఇక్కడి నటులు, దర్శకులు ఫైర్ అవుతున్నారు. ప్రభాస్ కు అండగా నిలబడి, బాలీవుడ్ ని ఏకిపారేస్తున్నారు. యువ హీరోలు అయితే ప్రభాస్ ను అనే స్థాయి మీది కాదు అంటూ… బాలీవుడ్ కథ ఎప్పుడో ముగిసిపోయిందని ఇప్పుడు సౌత్ హీరోలదే రాజ్యం అంటూ మాట్లాడుతున్నారు. అనవసరంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవద్దు అంటూ హితవు పలుకుతున్నారు. మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా బాలీవుడ్ కి లేఖ రాసారు.
ఇదిలా ఉంచితే తాజాగా దీనిపై కల్కీ సినిమా దర్శకుడు నాగ అశ్విన్ కూడా స్పందించారు. అర్షద్ వార్సీ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ… ఒక నెటిజన్ సోషల్ మీడియాలో కల్కీ సినిమాలో ఒక వీడియో పోస్ట్ చేసి… ఈ ఒక్క సీన్ బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తానికి సమానం అని క్యాప్షన్ పెట్టగా… దానిపై స్పందించిన నాగ అశ్విన్… టాలీవుడ్, బాలీవుడ్ అని వేరు చేసి మాట్లాడటం కరెక్ట్ కాదని అన్నాడు. ఇక నార్త్- సౌత్… టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్ అని ఇలా పోలుస్తూ వెనక్కు వెళ్ళవద్దు అంటూ సూచించాడు.
మనమందరం ఒక పరిశ్రమకు చెందిన వాళ్ళం అని, అర్షద్ కొంచెం ఆలోచించి మాట్లాడాల్సింది అని… అయినా ఫర్వాలేదు అన్నాడు నాగ అశ్విన్. మేము అతడి పిల్లల కోసం కల్కీ బుజ్జి బొమ్మలు పంపిస్తాం అంటూ సెటైర్ వేసాడు. కల్కీ రెండో భాగంలో ప్రభాస్ ను మరింత పవర్ ఫుల్ గా చూపించేందుకు కష్టపడి పని చేస్తా అంటూ నాగ అశ్విన్ కామెంట్స్ చేసాడు. ప్రపంచంలో చాలా మంది మనల్ని ద్వేషిస్తారు అని, కాని మనం వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి అని ప్రభాస్ కు ఇదే అంటారని నాగ అశ్విన్ అక్కడ కామెంట్ చేసారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.