Nandamuri Taraka Ratna: రాజకీయాల్లోకి తారకరత్న భార్య.. పోటీ చేయబోయే స్థానం అదేనా..

నందమూరి తారకరత్న.. ఎంతో భవిష్యత్ ఉన్న నటుడు. రాజకీయాల్లోకి కూడా అడుగుపెట్టాలని అనుకుంటున్న సమయంలో.. విధికే కన్ను కుట్టింది. చిన్న వయసులోనే ప్రాణం తీసింది. తాత ఆశయాలకు అనుగుణంగా ప్రజా సేవలో ఉండాలని నిర్ణయించుకున్న తారకరత్న.. రాజకీయాల్లో పూర్తి స్థాయి అడుగులు వేయడానికి ముందే అనంతలోకాలకు వెళ్లిపోయారు.

  • Written By:
  • Publish Date - May 8, 2023 / 08:00 PM IST

ఐతే తారకరత్న కోరికను, కలలను నిజం చేసేందుకు ఆయన భార్య అలేఖ్యా రెడ్డి రెడీ అవుతున్నారా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం రోజు.. తారకరత్న గుండెపోటుకు గురయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులు ఆసుపత్రిలి చికిత్స పొందుతూ.. ప్రాణాలు విడిచారు. ఆయన మరణం తర్వాతే.. ఆయనేంటో, ఆయనకు కుటుంబం పైన ఎంత ప్రేమో ప్రపంచానికి తెలిసింది. తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి.. ఇప్పటికీ ఆ విషాదం నుంచి బయటకు రాలేదు. భర్త జ్ఞాపకాలను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటూ.. ప్రతీ ఒక్కరితో కన్నీరు పెట్టిస్తున్నారు.

నిజానికి వచ్చే ఎన్నికల్లో తారకరత్న ఎమ్మెల్యేగానో, ఎంపీగానే పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఇప్పుడు అలాంటి ప్రచారమే ఆయన భార్య అలేఖ్యారెడ్డి చుట్టూ జరుగుతోంది. భర్త కలలు, ఆశయాలను నెరవేర్చేందుకు రాజకీయాల్లోకి దిగాలని అలేఖ్యారెడ్డి నిర్ణయించుకున్నారనే ప్రచారం సాగుతోంది. తారకరత్న బతికి ఉన్నప్పుడు.. గుడివాడ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించేవారు. ఐతే అక్కడ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా ఉన్న కొడాలి నానికి చెక్‌ పెట్టేందుకు ఎన్టీఆర్ కుటుంబం నుంచి అభ్యర్థిని బరిలోకి దింపితే బాగుంటుందని చంద్రబాబు కూడా ఆలోచన చేశారని.. దీంతో తారకరత్నకు అవకాశం ఇస్తారంటూ జరిగిన చర్చ అంతా ఇంతా కాదు.

ఐతే తారకత్న మరణం తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. గుడివాడలో టీడీపీ ఇంచార్జిగా రావి వెంకటేశ్వరరావు ఉన్నారు. ఆయనతో పాటు ఎన్ఆర్ఐ రాము కూడా.. టీడీపీ నుంచి పోటీకి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గం అంతా చుట్టి వచ్చారు. గుడివాడ చుట్టూ అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులకు అండగా నిలుస్తున్నారన్న చర్చజరుగుతోంది. ఇలాంటి సమయంలో భర్త ఆశయ సాధనకు అలేఖ్యారెడ్డి రంగంలోకి దిగి గుడివాడ టికెట్ కోరితే పరిస్థితి ఏంటా అన్న ఆలోచనే.. టీడీపీ శ్రేణులు కన్ఫ్యూజన్‌లో పడేస్తోంది. అసలు అలేఖ్యారెడ్డి నిజంగా రాజకీయాల్లోకి వస్తారా.. ఇది ప్రచారంగానే మిగిలిపోతుందా అంటే.. మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.