ప్రముఖ సినీనటుడు నందమూరి తారకరత్న(40) ఆరోగ్యం విషమించడంతో శనివారం రాత్రి 9.30గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. జనవరి 27న ఏపీలోని చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో నందమూరి తారకరత్న పాల్గొన్న కొద్ది సేపటికే అకస్మాత్తుగా కిందపడిపోయారు. వెంటనే ఆయనను టీడీపీ కార్యకర్తలు కుప్పంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గుండెపోటుకు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. వైద్యపరీక్షలలో ఆయన గుండెలో ఎడమవైపు 90శాతం బ్లాక్ అయిందని గుర్తించి మెరుగైన చికిత్సకోసం బెంగళూరులోని నుంచి నారాయణ హృదయాలయ ఆసుపత్రి తరలించారు. అత్యాధునిక వైద్యం అందించారు. అయితే వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. 23 రోజులుగా మృత్యువుతో పోరడి చివరికి శివరాత్రి రోజే శివైక్యం చెందారు నందమూరి తారకరత్న.
మాజీ సీఎం నందమూరి తారక రామారావు మనవడు, సినిమాటోగ్రఫర్ మోహన కృష్ణ కుమరుడు తారకరత్న. 1983 ఫిబ్రవరి 22న జన్మించిన తారకరత్న నందమూరి వంశంలో మూడో తరం నటుడు. 20 ఏళ్ల వయసులోనే హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. స్వర్గీయ ఎన్టీఆర్ తరువాత నందమూరి నట వారసత్వాన్ని బాలకృష్ణ ముందుండి నడిపిస్తున్నారు. అదే ఇమేజ్ తో హరికృష‌్ణ తనయుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రయాణిస్తున్నారు. అప్పుడు.. ఆ కుటుంబంలోని అందరి చూపు తారకరత్నపైనే ఉండేది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి రావడానికి తారకరత్న సై అనడంతో ఆయనతో సినిమాలు తీసేందుకు నిర్మాతలు, డైరెక్టర్లు క్యూ కట్టారు. అలా.. ఒక్క రోజే 9 సినిమాలకు క్లాప్ కొట్టించుకున్నారు తారకరత్న. ఇది ఒక రికార్డ్.
తారకరత్న.. 2002లో కోదందరామిరెడ్డి దర్శకత్వంలో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో తన ప్రస్థానం మెుదలుపెట్టారు. కేవలం 21 ఏళ్ల వయసులో ఆ సినిమాతో పాటు మరో 8 సినిమాలను ఒకేసారి అగ్రిమెంట్ చేసి తెలుగు సినీ పరిశ్రమలో చరిత్రను తిరగరాసారు. అయితే తారకరత్న అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఒకటో నెంబర్ కుర్రాడు మంచి పేరు తెచ్చినా తర్వాత సినిమాలు యువరత్న, భద్రాద్రి రాముడు, తారక్, నో వంటి సినిమాలు పెద్దగా అడలేదు. దీంతో ఆల్రెడీ కమిట్ అయిన నిర్మాతలు వెనక్కి తగ్గారు. అలా 9 సినిమాలకు ఒకేరోజు ప్రకటించిన్నపట్టికి చివరికి 4-5 సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. అలా వరుస పరాజయాలతో డీలా పడిన తారకరత్న కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉండిపోయారు. ఆ తర్వాత నటుడు చలపతిరావు తనయుడు రవిబాబు డైరెక్షన్ లో 2009లో వచ్చిన అమరావతి సినిమాతో విలన్ గా ప్రేక్షకులను మెప్పించి తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు తారకరత్న. ఆయనలోని కొత్త కొణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన తారకరత్న ఆ సినిమాతో నంది అవార్డు అందుకున్నారు. విలన్ గా కమ్ బ్యాక్ చేసిన తారకరత్న.. ఆ తరువాత మరికొన్ని సినిమాల్లో విలన్ గా చేసినప్పటికీ వర్కౌట్ కాలేదు. దీంతో సినిమాలు తారకరత్నకు అచ్చిరావు అనే ముద్ర ప్రేక్షల మదిలో పడిపోయింది. 2022లో హాట్ స్టార్( Hotstar) లో స్ట్రీమ్ ఐన 9 గంటలు వెబ్ సిరీస్ లో నటించాడు తారక్. అది కూడా ప్రేక్షకులని మెప్పించలేక పోయింది. తారకరత్నకు ఓ కోరిక నెరవేరకుండానే మిగిలిపోయింది. ఆయనకు తన బాబాయ్ బాలకృష్ణతో కలిసి ఒక సినిమా అయినా చేయాలని ఉండేది. కానీ ఆ కోరిక నెరవేరకుండానే తారకరత్న కన్నుమూశారు.
తన తాత ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో ఉంటూ ప్రజలకు సేవ చేయలని ప్రజా వ్యవస్థలో పనిచేయ్యలని కోరిక ఉండేది తారకరత్నకు. అందులో భాగంగానే కొంతకాలంగా టీడీపీలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని ఇటీవలే పార్టీ అధినేత చంద్రబాబుతో చెప్పినట్లు తెలిసింది. చంద్రబాబు కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. కానీ ఆ కల కూడా తీరకుండానే తారకరత్న కన్నుమూశారు.
నారాయణ హృదయాలయ ఆసుపత్రి నుంచి ప్రత్యేక అంబులెన్స్ లో హైద్రాబాద్ కి తారకరత్న భౌతికకాయాన్ని తరలించారు. సోమవారం ఉదయం 7.గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు తెలుగు ఫిలిం ఛాంబర్‌లో అభిమానుల సందర్శనార్థం తారకరత్న భౌతికకాయాన్ని ఉంచుతారు. సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో తారకరత్న అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.