Nara Bhuvaneshwari: సంఘీభావము తెలియజేయకూడదా..? భువనేశ్వరి ఆవేదన..!!

నారా భువనేశ్వరికి మద్దతుగా టీడీపీ కార్యకర్తలు తలపెట్టిన సంఘీభావ యాత్రకు పోలీసుల అనుమతి నిరాకరించింది. ఈ నేపథ్యంలో ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. తన ఆవేదనను వ్యక్తం చేశారు.

  • Written By:
  • Publish Date - October 17, 2023 / 11:50 AM IST

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గత 38 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈయన అరెస్ట్ ప్రజాస్వామ్య విరుద్దమని వాదిస్తోంది టీడీపీ. అందులో భాగంగా అరెస్ట్ అయినప్పటి నుంచి ప్రజల్లో ఉంటూ రకరకాల నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రహ్మిణి పాల్గొన్నారు. కొవ్వొత్తుల ర్యాలీ, ఐయామ్ విత్ బాబు, కంచాలు మోగిస్తూ, దీపాలు ఆర్పేసి ఇలా రకరకాల ప్రదర్శనలు చేపట్టారు. గాంధీ జయంతి రోజున నిరాహార దీక్ష కూడా చేపట్టారు. నిన్న న్యాయానికి సంకెళ్లు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇవన్నీ ఒక ఎత్తైతే తాజాగా నిర్వహించనున్న సంఘీభావ యాత్ర మరో ఎత్తుగా చెప్పుకోవాలి. పెళ్లి రోజునే తన భర్తను జైలులోకి వెళ్ళారు అనే ఆవేదన భువనేశ్వరిని కలిచి వేస్తోంది. అందులో భాగంగా ఆయన తిరిగి బయటకు రావాలని తిరగని గుడిలేదు, మొక్కని దైవం లేదు. ఇందులో భాగంగా ఆమెను ఓదార్చడానికి టీడీపీ కార్యకర్తలు నడుంబిగించారు.

పోలీసుల నోటీసు..

చంద్రబాబుకు మద్దతుగా అనే కార్యక్రమంలో భాగంగా టీడీపీ శ్రేణులు సంఘీభావయాత్ర చేపట్టేందుకు సిద్దమయ్యారు. అక్టోబర్ 17 నుంచి 19 వరకూ అంటే మూడు రోజుల పాటూ రాజమండ్రిలో నిర్వహించనున్నారు. ఛలో రాజమండ్రి కార్యక్రమానికి ఎలాంటి పోలీసు శాఖ అనుమతులు లేనందున వెళ్లడానికి వీలు లేదు. ఇందుకు విరుద్దంగా యాత్రలో పాల్గొన్న యెడల అట్టి వారిపై పోలీసులు చట్టరిత్యా తగు చర్యలు తీసుకోక తప్పదు అని నోటీసులు అందించారు.

భువనేశ్వరి స్పందన..

దీనిపై ట్విట్టర్ వేదికగా నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి స్పందించారు. ‘ చంద్రబాబుగారికి మద్దతుగా, రాజమండ్రిలో ఉన్న నన్ను కలిసి నాకు మనోధైర్యాన్ని ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంఘీభావ యాత్ర చేపడితే అందులో తప్పేముంది..? పార్టీ కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వాళ్లు. బాధలో ఉన్న అమ్మను కలిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు నోటీసులు ఇవ్వడం ఏంటి..? ప్రజలు, మద్దతుదారులు నన్ను కలవకూడదని చెప్పడానికి ఈ ప్రభుత్వానికి హక్కెక్కడిది.?’ అని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఈ యాత్ర జరుగుతుందా.. లేక అడ్డుకోవడం వల్ల విఫలమౌతుందా వేచిచూడాలి.

T.V.SRIKAR