రాజకీయాన్ని రాజకీయంలా మాత్రమే చేయాలి అనుకుంటారు పవన్. కుట్రలు ఉండవ్, కుతంత్రాలు ఉండవ్.. ఎత్తులు తెలియదు.. పై ఎత్తుల జోలికే వెళ్లరు.. జనాలకు అండగా ఉండడం, జనాల సమస్యలకు పరిష్కారం చూపించడం మాత్రమే రాజకీయం అని నమ్మే వ్యక్తి ఆయన! జనాల సంక్షేమం, సంతోషమే ముఖ్యం.. రాజకీయాల్లో ఖర్చుల కోసమే మాత్రమే సినిమాలు అని నిర్మొహమాటంగా చెప్పే పవన్.. అన్నా అని ఎవరు ఆర్తితో చూసినా వెంటనే అక్కడే ప్రత్యక్షం అవుతారు. నిజమైన మనిషి అని కొందరు.. నాయకుడు అని మరికొందరు.. దేవుడు అని ఇంకొందరు.. ఇలా ఎవరికి వారు పవన్‌ను గౌరవిస్తారు. ఒకరకంగా ఆరాధిస్తారు. ఇదీ పవన్ గురించి జనసేన వర్గాలు, ఆయన అభిమానుల నుంచి వినిపించే మాట.
పార్టీ ప్రారంభించిన తర్వాత టీడీపీతో కలిసి పోటీ చేసిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత పరిణామాలతో సైకిల్ పార్టీకి దూరం అయ్యారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగారు. ఆ సమయంలో టీడీపీ శ్రేణులు, టీడీపీ అనుకూల మీడియా పవన్‌ను టార్గెట్ చేస్తూ గుప్పించిన విమర్శలు అన్నీ ఇన్నీ కావు. కట్ చేస్తే.. అదే టీడీపీ ఇప్పుడు పవన్ కోసం స్నేహ హస్తం చాచుతోంది. సినిమా స్టార్లు తమకు అవసరం లేదని ఒకప్పుడు ఎవరైతే పవన్ మీద ఆరోపణలు గుప్పించారో.. ఇప్పుడు అదే వ్యక్తులు పవన్‌ను పెద్దన్న అంటున్నారు. ఇది కదా సేనాని రేంజ్ అంటూ జనసైనికులు గర్వంతో కనిపిస్తున్నారు. పార్ట్‌టైమ్ రాజకీయ నాయకుడు అని ఇన్నాళ్లు విమర్శలు ఎదుర్కొన్న పవన్.. తాను రంగంలోకి దిగితే రేంజ్ ఎలా ఉంటుందో.. ఆ ఇంపాక్ట్ ఏంటో చూపిస్తున్నారు.
ముఖ్యంగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ శ్రేణుల నైరాశ్యం మధ్య తానున్నానంటూ ముందుకు వచ్చిన పవన్.. రెండు పార్టీలకు ఉమ్మడి నాయకుడిగా ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేసిన తీరు జనసేన నాయకులతో పాటు తెలుగుదేశం కార్యకర్తలను కూడా ఆనందంతో పాటు ఆశ్చర్యానికి గురిచేసింది. టీడీపీ అనుకూల మీడియా అయితే ఏకంగా పవన్‌కు సెల్యూట్ చేసింది. అసాధారణ పోరాట పటిమ ప్రదర్శించారని మిత్రుడికి కష్టకాలంలో తోడుగా నిలబడటం అంటే ఏమిటో నిరూపించారని హ్యాట్సాఫ్ చెప్పారు ఏకంగా ! తమ పార్టీ ఎదగడానికి ఒక అవకాశంగా దీనిని మలుచుకోకుండా సాటి మిత్రపక్షం నాయకుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఒక పెద్దన్నలా వ్యవహరించిన తీరు… రాజకీయాల్లో పవన్ ఎలాంటి విలక్షణ నాయకుడో ప్రూవ్ చేసినట్లు అయింది. ఇక లోకేశ్ అయితే.. తన వెనక పెద్దన్నలాంటి పవన్ ఉన్నారని మీడియా ముందే చెప్పారు. పవన్ ఏ స్థాయిలో టీడీపీకి ఆపద్బాంధవుడులా నిలిచిరాన్నది అర్థం అవుతోంది.