World Biggest Diamond Building: ప్రపంచంలోనే అతి పెద్ద డైమండ్ భవనం.. వజ్రపు వెలుగులకు సిద్దమైన సూరత్ నగరం..

డైమండ్ దీనికి ఉన్న విలువ అంతా ఇంతా కాదు. అమ్మాయి మొదలు అలంకారం వరకూ దీనిని ఉపయోగించని వారు ఉండరు. ఇలాంటి వజ్రాల వ్యాపారానికి ప్రపంచంలో పేరు గణించింది బెల్జియంలోని యాంట్ వేర్స్. దీని పేరు చెబితే కాస్త ఈ వ్యాపారం మీద అవగాహన ఉండే వారు వజ్రాలకు కేరాఫ్ అడ్రస్ అని చెబుతారు. అలాంటి వజ్రాల సామ్రాజ్యం మన భారత్ లో మెరిసేందుకు సిద్దం అయింది. ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్  భవనాన్ని నిర్మించేందుకు గుజరాత్ వేదికైంది. భారతావని సిగలో అందాల వజ్రపుకిరీటాన్ని సూరత్ నగరం ఏర్పాటు చేసింది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

  • Written By:
  • Publish Date - July 20, 2023 / 02:13 PM IST

మన దేశంలో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ ను గుర్తుచేస్తే టెక్స్ టైల్స్ పరిశ్రమలకు పెట్టింది పేరుగా చెబుతూ ఉంటారు. దీనికి కారణం అక్కడ పత్తి అధిక సంఖ్యలో ఉత్పత్తి అవుతుంది. ఇక పై ఈపేరును వజ్రాల పరిశ్రమ డస్టర్ లో తుడిచినట్లు తుడిచేసే పరిస్థితి రాబోతుంది. ఎందుకంటే దాదాపు ఒకే చోట 65 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలతో పాటూ వర్తక, వాణిజ్య లావాదేవీలకు కేంద్రంగా మారబోతుంది. అలాగే వజ్రాన్ని పరిశీలించే నిపుణులు కూడా ఇక్కడికి వచ్చి వాటి నాణ్యాత, పరిమాణాలను పరీక్షించేలా అతి సుందర, సువిశాల భవనాలను నిర్మించారు. ఈ సందర్భంగా మనం అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయాన్ని గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ఆఫీస్ స్పేస్ కలిగిన పెంటాగాన్ కార్యాలయాన్ని అధిగమిస్తూ ఈ వజ్రాల భవంతిని నిర్మించారు. అంటే ఇప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద ఆఫీస్ స్పేస్ కలిగిన బిల్డింగ్ మన ఇండియాలో ఉందనమాట. ఈ సువిశాల భవనాన్ని 71 లక్షల చదరపు అడుగులలో ఏర్పాటు చేశారు.

ప్రపంచంలోని వజ్రాలకు ప్రసిద్ధి సూరత్

ప్రపంచ వ్యాప్తంగా లభించే వజ్రాల్లో మేలిమి జాతి డైమండ్స్ ను సానబెట్టడంలో సూరత్ దే అగ్రస్థానం. ఎందుకంటే 90 శాతం వజ్రాలను సానబెట్టేది ఈ ప్రాంతంవారే కావడం విశేషం. అందుకే దీనిని భారత దేశపు జెమ్స్ క్యాపిటల్ గా పిలుస్తారు. ఈ ప్రాంతానికి ఇంతటి ప్రాధాన్యం ఉంది కనుకే సూరత్ డైమండ్ బౌర్స్ అని నామకరణం చేశారు. బౌర్స్ అంటే స్టాక్ ఎక్స్ ఛేంజ్ జరిపే సుప్రసిద్ద ప్రదేశం అని అర్థం. ఇది ఫ్రాన్స్ లోని పారిస్ నగరంలో ఉంది. అక్కడ స్టాక్ మార్కెట్లకు ప్రసిద్ది చెందితే ఇక్కడ వజ్రాలకు ప్రసిద్ది చెందినది కనుక ఈ విధమైన పేరును ప్రతిపాదించారు.

తయారీతో పాటూ వ్యాపారానికి అనువుగా

ఈ సువిశాల కార్యాలయంలో వజ్రాలను సానబెట్టే వారు మొదలు కట్టర్ల వరకూ వ్యాపారాలు చేసే వారి నుంచి పరిశ్రమలో కీలకమైన వ్యక్తుల వరకూ అందరూ తమకు సంబంధించిన విధులు ఇక్కడే నిర్వర్తించుకుంటారు. ప్రతి ఒక్కరికీ ఒక్కో రకమైన విభాగాలు ఇక్కడ అందుబాటులో ఉంచారు. ఈ భవనాన్ని డైమండ్ లో ఉండే తొమ్మిది చతురస్రాకారాలకు ప్రతీకగా తొమ్మిది చతురస్రాకార భవంతులను వేరువేరుగా నిర్మించి లోలోపల కలుపుకుంటూ వచ్చారు. ఈ డిజైన్ మరో ప్రత్యేకతను సంతరించుకుంది. ఇలా మొత్తం 35 ఎకరాల్లో అంటే దాదాపు 71 లక్షల చదరపు అడుగుల్లో విశాలవంతమైన ఆఫీస్ స్పేస్ తో రూపొందించబడింది.

Narendra Modi will inaugurate a building called Surat Diamond Bourse in Gujarat, which will be the largest building in the world

ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం

ఈ ఏడాది నవంబర్ మాసంలో దేశ ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. దీనిని సూరత్ నగరానికి దక్షిణ దిక్కులో స్మార్ట్ సిటీ పేరుతో ఏదైనా భవనాన్ని ఏర్పాటు చేయాలని స్వయంగా మోదీనే ప్రతిపాదించారు. అందుకు తగ్గట్టుగా పనులు చకచకా సాగాయి. కోవిడ్ సమయంలో మినహా మిగిలిన కాలంలో పనులు యుద్దప్రాతిపదికన చేస్తూ కేవలం మూడేళ్లలో నిర్మించారు.

డిజైన్ విషయానికొస్తే ఇలా

ఈ ప్రత్యేకమైన ప్రాజెక్టును డిజైన్ల కోసం తొలుత ఇంటర్నేషనల్ బిడ్డింగ్ కు ఆహ్వానించారు. కానీ ఈ బిడ్డింగ్ లో భారత్ కి చెందిన మోర్ఫోజెనిసిస్ ఆర్కిటెక్చర్ సంస్థ నిర్మాణ బాధ్యతలను చేజిక్కించుకుంది. నిర్మాణ పనులు చేపట్టడం మొదలు డైమండ్ కంపెనీలు తమ వర్తక వాణిజ్యాలను పెంపొందించుకునేందుకు క్యూలు కట్టాయి. అది కూడా కేవలం వ్యాపార భవనాల కోసం. ఇంతమందిని ఆకట్టుకున్న దీని ఆర్కిటెక్ ఎయిర్ పోర్ట తరహాలో అన్ని బిల్డింగులను కలుపుతూ సింగల్ సెంట్రల్ కారిడార్ ను నిర్మించారు. దీని గురించి మోర్ఫోజెనిసిస్ కో ఫౌండర్ సోనాలీ రస్తోగీ స్పందించారు. ‘ఇందులో పనిచేసే అందరికీ సమానంగా అన్ని సౌకర్యాలు అనే విధానంతో పూర్తి ప్రజాస్వామ్య బద్దంగా ఈ డిజైన్ రూపొందించాం. సెంట్రల్ కారిడార్ ద్వారా అందరికీ అన్ని సౌకర్యాలు సమానదూరంలో ఉంటాయి. అంటే ప్రధాన ద్వారం గుండా లోనికి ఎటు వచ్చినా దుకాణాలకు చేరుకునేందుకు కేవలం ఏడు నిమిషాల కాలం పడుతుంది. కాంక్రీట్ వనంగా కనిపించకుండా ఉండేందుకు 1.5 ఎకరాల విస్తీర్ణంలో గార్డెనింగ్ ఏర్పాటు చేశాం’ అని వివరించారు.

పర్యావరణహితంగా..

సాధారణంగా ఇలాంటి పెద్ద పెద్ద భవంతులు నిర్మిస్తే అంతే పరిమాణంలో కాలుష్యం వెదజల్లుతుంది. పైగా దీనిని నిర్మించేందుకు ఇందనం కూడా అధికంగా వినియోగించాల్సి వస్తుంది. అయితే ఈ వజ్రాల గనికి 50 శాతం కంటే కూడా తక్కువ ఇంధనం వినియోగించుకుంటుంది. అందుకే దీనిని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్లాటినమ్ రేటింగ్ ను ఇచ్చింది. ఇక గాలి విస్తృతంగా వీచేందుకు భవనాల మధ్యమధ్యలో గుండ్రని ఆకార డిజైన్లలో శ్లాబులనువదిలేశారు. దీని గుండా గాలి, వెలుతురు ప్రసరించి లోపలి భాగాలన్నింటినీ కూల్ గా మారుస్తుంది. సగం భవన నిర్మాణం మొత్తం వెంటిలేషన్ కి వీలుండేలా నిర్మించారు. అలాగే లైటింగ్ విషయానికొస్తే సౌర విద్యుత్ ద్వారా పవర్ ను తీసుకొని వజ్రాన్ని మించిన కాంతులను అందించేందుకు ప్లాన్ చేశారు. నిర్మాణ పరంగా, డిజైన్ పరంగా, పర్యావరణానికి హాని కలిగించని కోణంలో కూడా ఆలోచింది మంచి ప్లాన్ తో విశాలమైన ఆర్కిటెక్చర్ తో దీనిని నిర్మించారు.

T.V.SRIKAR