భారత దేశంలో ఆడపిల్లలపై అప్పటి నుంచి ఇప్పటి దాకా వివక్ష అనేది కొనసాగుతూనే ఉంది. మగపిల్లలతో పోలిస్తే ఆడ పిల్లల విషయంలో ఇంకా అసమానతలు కనిపిస్తున్నాయి. ఆడ, మగ బేధం లేదు… ఇద్దరూ సమానమే అని అందరికీ తెలియజేయాలన్న ఉద్దేశ్యంతో ప్రతి యేటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవం నిర్వహిస్తున్నారు.
భారతీయ సమాజంలో ఆడపిల్లలకు ఎదురవుతున్న అసమానతలపై అవగాహన కల్పించి… జనంలో చైతన్యం తెచ్చేందుకు ప్రతి ఏటా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని నిర్వహిస్తోంది కేంద్ర ప్రభుత్వం. విద్య, ఆరోగ్యం, పోషకాహారంలో ఆడపిల్లలకు కూడా సమాన అవకాశాలు ఉండాలి. అంతేకాదు… బాలిలక హక్కుల గురించి అవగాహన పెంచడం, బాల్య వివాహాలు, వివక్ష, బాలికలపై హింస, లైంగిక వేధింపులు లాంటి సమస్యలను పరిష్కరించేందుకు జాతీయ బాలికా దినోత్సవం జరుపుతున్నాం. జాతీయ బాలికా దినోత్సవం ద్వారా ప్రతి ఆడపిల్లకు సమానత్వం, గౌరవాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. అందుకే ప్రతి ఏటా జనవరి 24న బాలికల సాధికారిత సందేశాన్ని దేశ వ్యాప్తంగా వినిపించేందుకు అవగాహన కల్పిస్తున్నారు అధికారులు.
ప్రతి ఆడపిల్లకు సమాన అవకాశాలు, గౌరవం దక్కాలి. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో ఇంకా బాలికల విద్య, శ్రేయస్సుపై నిర్లక్ష్యం జరుగుతోంది. అందుకే బేటీ బచావో, బేటీ పడావో కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతి ఆడపిల్ల కూడా చదువుకోవాల్సిందే. కొన్ని చోట్ల ఆడపిల్ల పుట్టింది అనగానే పురిట్లోనే చంపేస్తున్నారు. గతం కంటే ఈ దోరణి చాలా వరకూ తగ్గింది. అయినప్పటికీ… ఇంకా గిరిజన తండాలు, మారుమూల గ్రామాల్లో ఇలాంటి చర్యలు జరుగుతూనే ఉన్నాయి.
జాతీయ బాలికా దినోత్సవాన్ని 2008 నుంచి మహిళా, శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతి ఏటా దేశమంతా ఈ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. లింగ అసమానత, విద్యా పరిమితులు, పాఠశాల డ్రాపవుట్ లు, ఆరోగ్య సంరక్షణ, బాల్య వివాహాలు, లింగ ఆధారిత హింసతో ఇబ్బంది పడుతున్న బాలికలకు పరిష్కార మార్గాలు చూపించడంపై దృష్టి పెడుతున్నారు.
2019లో ఎంపవరింగ్ గర్ల్స్ ఫర్ ఎ బ్రైటర్ టుమారో అనే థీమ్ పెట్టారు. 2020లో థీమ్ మై వాయిస్, అవర్ కామన్ ఫ్యూచర్. ఇక 2021లో డిజిటల్ జనరేషన్, అవర్ జనరేషన్ అనే థీమ్. 2015 జనవరి 22న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన బేటీ బచావో, బేటీ పడావో పథకం వార్షికోత్సవం సందర్భంగా జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుతున్నారు. మహిళ, శిశు అభివృద్ది, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ, విద్యాశాఖ కలసి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
గత కొంత కాలంగా ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలతో బాలికల్లో చదువుకునే వారి సంఖ్య పెరిగింది. బాల్య వివాహాలు కూడా చాలా మటుకు తగ్గాయి.