VVS Laxman : NCAకు లక్ష్మణ్ గుడ్ బై.. కొత్త హెడ్ గా మాజీ బ్యాటింగ్ కోచ్

జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ గా కొత్త వ్యక్తిని నియమించేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పదవీకాలం ఈ ఏడాది అక్టోబర్ తో ముగియనుంది.

 

 

జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ గా కొత్త వ్యక్తిని నియమించేందుకు బీసీసీఐ రెడీ అవుతోంది. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ పదవీకాలం ఈ ఏడాది అక్టోబర్ తో ముగియనుంది. మరోసారి అవకాశమిచ్చేందుకు బీసీసీఐ సిధ్ధంగా ఉన్నా లక్ష్మణ్ మాత్రం ఆసక్తి లేడని తెలుస్తోంది. దీంతో అతని స్థానంలో టీమిండియా మాజీ కోచ్ విక్రమ్ రాథోడ్ ను నియమించాలని బీసీసీఐ భావిస్తోంది. 2021లో ద్రావిడ్ టీమిండియా కోచ్ గా ఎంపికవడంతో అతని స్థానంలో లక్ష్మణ్ కు ఎన్సీఏ హెడ్ బాధ్యతలు దక్కాయి. యువక్రికెటర్లకు తర్ఫీదునివ్వడం, గాయాల నుంచి కోలుకునే ఆటగాళ్ళకు రిహాబిలిటేషన్ కల్పించడం జాతీయ క్రికెట్ అకాడమీలో ప్రధాన బాధ్యతలుగా ఉంటాయి. ఈ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తూనే మధ్యలో టీమిండియాకు తాత్కాలిక కోచ్ గా కూడా లక్ష్మణ్ వ్యవహరించాడు.

ద్రావిడ్ అందుబాటులో లేనప్పుడు లక్ష్మణ్ నే బీసీసీఐ తాత్కాలిక కోచ్ గా జట్టుతో పాటు పంపించేది. అయితే మరోసారి ఎన్సీఏ హెడ్ కొనసాగేందుకు లక్ష్మణ్ ఆసక్తి చూపించడం లేదు. అతను ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు మెంటార్ గా ఉండేందుకు మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. బిజీ షెడ్యూల్ తో కుటుంబానికి దూరంగా ఉండడమే లక్ష్మణ్ మరోసారి ఎన్సీఎ బాధ్యతలు తీసుకోకపోవడానికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అదే ఐపీఎల్ టీమ్ తో ఒప్పందం రెండు,మూడు నెలల పాటే ఉంటుంది. మిగిలిన టైమ్ కామెంటేటర్ గానూ ఒప్పందాలు చేసుకోవచ్చు.