జట్టులోకి కొత్త ఆల్ రౌండర్, అశ్విన్ స్థానంలో తనుష్

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతుండగానే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. తుది జట్టులో చోటు దక్కడం కష్టమేనని క్లారిటీ రావడంతో వీడ్కోలు పలికేశాడు.

  • Written By:
  • Publish Date - December 24, 2024 / 06:02 PM IST

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతుండగానే సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. తుది జట్టులో చోటు దక్కడం కష్టమేనని క్లారిటీ రావడంతో వీడ్కోలు పలికేశాడు. గబ్బా టెస్ట్ ముగిసిన వెంటనే టీమిండియా ఇటు మెల్ బోర్న్ కు బయలుదేరితే… అశ్విన్ స్వదేశానికి వచ్చేశాడు. అయితే అశ్విన్ రీప్లేస్ మెంట్ గా బీసీసీఐ సెలక్షన్ కమిటీ మరో ఆల్ రౌండర్ ను ఎంపిక చేసింది. ఎవ్వరూ ఊహించని విధంగా ముంబైకి చెందిన తనుష్ కొటియాన్ కు ఆసీస్ తో చివరి రెండు టెస్టులకు పిలుపునిచ్చింది. మెల్ బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్‌తో పాటు జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరిగే చివరి టెస్ట్‌కు తనుష్ కోటియన్ భారత జట్టుకు అందుబాటులో ఉండనున్నాడు.

ఆఫ్ స్పిన్నర్ అయిన 26 ఏళ్ల తనుష్ కోటియన్ ముంబై తరఫున దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. 10 ఓవర్లు బౌలింగ్ చేసి 38 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ తరహాలోనే ఆఫ్ స్పిన్ వేయడంతో పాటు లోయరార్డర్‌లో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం ఉండటం తనుష్ కోటియన్‌కు కలిసొచ్చే అంశం. ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉన్న టీమిండియా సీనియర్ స్పిన్నర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లతో కూడిన స్పిన్ విభాగంలో తనుష్ కోటియన్ భాగం కానున్నాడు. ఇప్పటి వరకు 33 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన తనుష్ కోటియన్ 101 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. బ్యాటర్‌గా రెండు శతకాలతో పాటు 13 హాఫ్ సెంచరీలతో 1525 పరుగులు చేశాడు. అలాగే 2023-24 సీజన్ లో ముంబై జట్టు రంజీ ఛాంపియన్ గా నిలవడంలోనూ ఈ ఆల్ రౌండర్ పాత్ర చాలానే ఉంది. రంజీ సీజన్ లో 41కి పైగా యావరేజ్ తో 500కు పైగా పరుగులు చేయడంతో పాటు 29 వికెట్లు తీశాడు. తద్వారా ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఈ ప్రదర్శనతోనే ఆసీస్ తో టెస్ట్ సిరీస్ కు సెలక్టర్లు అతన్ని ఎంపిక చేశారని తెలుస్తోంది.