బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వరుస సిరీస్ ల నేపథ్యంలో సౌతాఫ్రికా టూర్ నుంచి హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు రెస్ట్ ఇచ్చింది.గంభీర్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్ కు బాధ్యతలు అప్పగించింది. బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న లక్ష్మణ్ గతంలో కూడా టీమిండియాకు తాత్కాలిక కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. జింబాబ్వే పర్యటనలో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని యువ జట్టును కోచ్‌గా నడిపించాడు. ఇప్పుడు మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా టూర్ కోసం మళ్ళీ టీమిండియా కోచింగ్ బాధ్యతలు తీసుకోనున్నాడు. బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం… సౌతాఫ్రికా టూర్ కూ , ఆసీస్ తో సిరీస్ కూ మధ్య ఎక్కువ గ్యాప్ లేకపోవడమే… ఆసీస్ గడ్డపై భారత్ ఐదుటెస్టుల సిరీస్ ఆడనుంది. దీని కోసం టెస్ట్ జట్టుకు ఎంపికైన పలువురు ఆటగాళ్ళందరూ ముందే అక్కడకు వెళ్ళి ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు.
మూడోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవాలనుకుంటున్న టీమిండియాకు ఈ సారి ఆసీస్ గట్టిపోటీనివ్వడం ఖాయం. పైగా ఆసీస్ పేస్ పిచ్ లపై నిలబడాలంటే ముందుగానే అక్కడకు వెళ్ళి పరిస్థితులకు అలవాటు పడాలి. పైగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో నిలిచేందుకు ఈ సిరీస్ మనకు అత్యంత కీలకం కానుంది. నవంబర్ 22 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి రోహిత్ సేన నవంబర్ 10న బయలుదేరే అవకాశం ఉంది. మరోవైపు దక్షిణాఫ్రికాలో నవంబర్ 8 నుంచి 13వ తేదీ వరకు సౌతాఫ్రికాతో సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని జట్టు నాలుగు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్రమంలో సౌతాఫ్రికా సిరీస్‌కు కోచ్‌గా వ్యవహరించడానికి గంభీర్‌కు సాధ్యపడదు. ఈ నేపథ్యంలో లక్ష్మణ్‌కు తాత్కాలిక కోచ్‌గా బీసీసీఐ బాధ్యతలు అప్పగించింది. లక్ష్మణ్‌కు సహాయక కోచింగ్ సిబ్బందిగా ఎన్సీఏలో ఇతర కోచ్‌లు, స్టాఫ్ అయిన సాయిరాజ్ బహుతులే, హృషికేష్ కంటికర్, శుభదీప్ ఘోష్ పనిచేయనున్నారు. ఎమర్జింగ్ ఆసియా టీ20 కప్‌కు భారత-ఏ జట్టుకు సాయిరాజ్ బహుతులే ప్రధాన కోచ్‌గా పనిచేశారు.
ఇదిలా ఉంటే సౌతాఫ్రికా టూర్ కు పలువురు యువ ఆటగాళ్ళతో బీసీసీఐ జట్టును ఎంపిక చేసింది. . సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీ20 టీమ్‌లోకి హైదరాబాదీ తిలక్ వర్మ తిరిగి రాగా.. మిడిలార్డర్ బ్యాటర్ రమణ్‌దీప్ సింగ్, పేసర్ విజయ్‌కుమార్ వైశాక్, యష్ దయాల్ తొలిసారి ఎంపికయ్యారు. ఈ సిరీస్ కు భారత స్టార్ ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, శుభమాన్ గిల్ లను ఎంపిక చేయలేదు. బోర్డర్–గావస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లే ఇండియా టెస్టు జట్టులో జైస్వాల్, గిల్ ఎంపికయ్యారు. తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డికి సైతం ఆస్ట్రేలియా టూర్ కు ఎంపిక కావడంతో అతన్ని సఫారీలతో టీ20 సిరీస్ కు పరిగణలోకి తీసుకోలేదు. కాగా ఆసీస్ పర్యటనలో తొలి టెస్టుకు పెర్త్ ఆతిథ్యమిస్తోంది. మరోవైపు సౌతాఫ్రికాతో తొలి టీ ట్వంటీ నవంబర్ 8న డర్బన్ వేదికగా జరగనుండగా… మిగిలిన మూడు మ్యాచ్ లకు సెయింట్ జార్జ్ పార్క్ , సెంచూరియన్ , జొహెన్నెస్‌బర్గ్ ఆతిథ్యమివ్వనున్నాయి.