KCR: ముందు నుయ్యి.. వెనుక గొయ్యి! కేసీఆర్‌కు ఇక మూడింది!

 కేసీఆర్‌ తెలివితేటలకే చెక్‌ పెట్టేలా కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. కర్ణాటకలో ఇప్పటికే పాగా వేసిన హస్తంపార్టీ.. క్రమక్రమంగా తెలంగాణవైపు ఫోకస్ పెంచింది. కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారానికి బీజేపీ వ్యతిరేక పార్టీ నేతలను పిలవగా అందులో కేసీఆర్‌ కూడా ఉన్నారు. ఇప్పుడు అక్కడికి వెళ్తే ఒక బాధ.. వెళ్లకపోతే మరో బాధ..!

  • Written By:
  • Publish Date - May 19, 2023 / 12:53 PM IST

‘ఒక దెబ్బకు రెండు పిట్టలు’ అన్న నానుడిని నిజం చేస్తూ ఒక్క ఐడియాకు రెండు పార్టీలను ఇరకాటంలో పెట్టేలా కాంగ్రెస్‌ వేసిన అడుగుతో కేసీఆర్‌ ఫ్యూజులౌటయ్యాయి. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లుంది కేసీఆర్‌ ప్రస్తుత పరిస్థితి. కర్ణాటక కాంగ్రెస్‌ సీఎంగా రేపు సిద్ధరామయ్య ప్రమాణస్వీకారం చేయనుండగా.. బీజేపీ వ్యతిరేక పార్టీ లీడర్లను సోనియా ఆహ్వానించారు. నిజానికి బీజేపీ వ్యతిరేక పార్టీల యూనిటీని చూపించేందుకు ఇదే సరైన వేదిక. కేంద్రంలో బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్‌ లేకుండా అది సాధ్యమవ్వదు. అయితే కాంగ్రెస్‌ను కలుపుకోవద్దంటూ కేసీఆర్‌ పదేపదే చెబుతూ వస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ కాకుండా ప్రాంతీయ పార్టీల కూటమితో గెలుపు సాధించాలన్నది ఆయన ఆలోచన. అయితే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘనవిజయం సాధించడం.. ఎస్పీ, టీఎంసీ లాంటీ పార్టీలు కాంగ్రెస్‌కు మద్దతివ్వడంతో కేసీఆర్‌కు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. అటు కాంగ్రెస్‌ను వ్యతిరేకించడానికి కేసీఆర్‌కు బలమైన కారణముంది.

తెలంగాణలో కాంగ్రెసేతోనే ప్రధాన పోటి:
నిజానికి తెలంగాణలో కాంగ్రెస్‌కి ఇప్పటికీ మంచి బెస్‌ ఉంది. గ్రౌండ్‌ లెవల్‌, పల్లెల్లో కాంగ్రెస్‌ను అభిమానించేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. పార్టీ అంతర్గత కుమ్ములాటలతో ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోతున్న మాట నిజమే కానీ.. కర్ణాటక తరహాలోనే రేవంత్‌, ఇతర సీనియర్లు కలిసి పని చేస్తే కేసీఆర్‌కు చుక్కలు కనపడడం ఖాయం. ఇప్పుడిదే భయం బీఆర్‌ఎస్‌ పార్టీకి పట్టుకుంది. రాహుల్ డైరెక్షన్‌లో కర్ణాటకలో అప్పటివరకు డిస్టెన్స్‌ మెయింటైన్ చేసిన డీకే శివకుమార్‌, సిద్ధరామయ్య ఎన్నికలకు మాత్రం కలిసే అడుగులేశారు. ఇక్కడ కూడా రాహుల్ మాటతో కాంగ్రెస్‌లో యూనిటీ పెరిగితే అది బీఆర్‌ఎస్‌ ఓట్లపై భారీగా ప్రభావం చూపుతుంది. అటో.. ఇటో అయితే బీఆర్‌ఎస్‌కు కర్ణాటకలో బీజేపీకి పట్టిన గతే పడతుందన్న అభిప్రాయాలు కూడా మరోవైపు నుంచి వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ను తక్కువ అంచనా వేసే పరిస్థితిలో కేసీఆర్‌ ఇప్పుడు లేరు. ఇదే సమయంలో సిద్ధరామయ్య ప్రమాణస్వీకార ఆహ్వానం ఆయన్ను మరింత ఇబ్బంది పెట్టేలా మారింది.

Karnataka oath cermony invitation to cm kcr

వెళ్లినా.. వెళ్లకపోయినా.. తలనొప్పి మాత్రం ఫిక్స్‌:
ఒకవేళ కాంగ్రెస్‌ పంపిన ఆహ్వానానికి కేసీఆర్‌ వెళ్లారనుకుందాం.. అప్పుడు బీజేపీ ఎంట్రీ ఇస్తుంది. ‘చూశారా.. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒక్కటే.. ఇదంతా డ్రామా’ అంటూ బండి సంజయ్‌ మొదలుపెడతారు.. మిగిలిన కార్యకర్తలు అదే రాగం అందుకుంటారు. ఒకవేళ కాంగ్రెస్‌ పంపిన ఆహ్వానానికి ఏదో వ్యక్తి గత కారణాలు చూపిస్తూ కేసీఆర్‌ డుమ్మా కొట్టాడనుకుందాం.. అప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ సీన్‌లోకి దిగుతుంది..! ‘బీఆర్‌ఎస్‌, బీజేపీ రెండు ఒకటేనానని, ఇదంతా మ్యాచ్‌ ఫిక్సింగ్‌లో భాగమేనని.. అందుకే బీజేపీయేతర పార్టీ నేతల కలయికకు కేసీఆర్‌ రాలేదని రేవంత్‌ రెడ్డి పాత పాటే మళ్లీ పాడొచ్చు’. మిగిలిన సీనియర్లు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రచారాలు చేస్తారు. అప్పుడు కేసీఆర్‌ తీవ్ర ఇబ్బందుల్లో పడతారు. కేంద్రంలో బీజేపీ ఓడిపోవాలని కానీ కాంగ్రెస్‌తో కలవకూడదు..ఒకవేళ అలా కలిస్తే రాష్ట్రంలో ఎదురుదెబ్బ తగలడం పక్కా! రాజకీయాల్లో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న కేసీఆర్‌కు కాంగ్రెస్‌ వేసిన బౌన్సర్‌ మాత్రం గట్టిగానే తగిలినట్లు కనిపిస్తోంది. మరి కేసీఆర్‌ ఆ బౌనర్స్ తర్వాత బంతిని సిక్సర్‌గా మారుస్తాడా లేక డిఫెండ్‌ చేసి డిఫెన్స్‌లో పడిపోతాడా అన్నది వెయిట్ అండ్‌ సీ!