ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్ టీ10 లీగ్ లో ధోనీ ?

క్రికెట్ ఫాస్టెస్ట్ ఫార్మాట్ గా పేరు తెచ్చుకున్న టీ10 లీగ్ క్రమంగా విస్తరిస్తోంది. సరిగ్గా పదేళ్ళ క్రితం ఎడారి దేశంలో ప్రారంభమైన అబుదాబీ టీ10 లీగ్ కు ప్రతీ ఏటా క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు 11వ సీజన్ కు కౌంట్ డౌన్ మొదలైంది.

  • Written By:
  • Publish Date - October 20, 2024 / 01:30 PM IST

క్రికెట్ ఫాస్టెస్ట్ ఫార్మాట్ గా పేరు తెచ్చుకున్న టీ10 లీగ్ క్రమంగా విస్తరిస్తోంది. సరిగ్గా పదేళ్ళ క్రితం ఎడారి దేశంలో ప్రారంభమైన అబుదాబీ టీ10 లీగ్ కు ప్రతీ ఏటా క్రేజ్ పెరుగుతూనే ఉంది. ఇప్పుడు 11వ సీజన్ కు కౌంట్ డౌన్ మొదలైంది. తాజాగా ఆటగాళ్ళ డ్రాఫ్ట్ కూడా ముగియడం , ఈ సారి పలువురు అంతర్జాతీయ స్టార్ క్రికెటర్లు ఈ లీగ్ లో ఆడుతుండడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దినేశ్ కార్తీక్ , రషీద్ ఖాన్, జాస్ బట్లర్ , కిరణ్ పొల్లార్డ్ , పతిరణ , హసరంగా లాంటి 179 మంది స్టార్ క్రికెటర్లు 11వ సీజన్ లో ఆడేందుకు ఒప్పందం కుదిరింది. అయితే టీ10 లీగ్ లో భారత క్రికెటర్ల ప్రాతినిథ్యం తక్కువగానే ఉంది. కేవలం రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్లు మాత్రమే దీనిలో ఆడుతున్నారు. అయితే అబుదాబీ టీ10 లీగ్ ఛైర్మన్ షాజీవుల్ ముల్క్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చే న్యూస్ చెప్పారు.

భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ టీ10 లీగ్ ఆడే అవకాశాలున్నాయంటూ హింట్ ఇచ్చారు. రిటైరయిన ప్లేయర్స్ విదేశీ లీగ్స్ లో ఆడేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇస్తోందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ధోనీని తమ లీగ్ లో ఆడించేందుకు ప్రయత్నిస్తామని షాజీ వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలువురు విదేశీ స్టార్ క్రికెటర్లు క్రికెట్ ఫాస్టెస్ట్ ఫార్మాట్ లో ఆడుతుండడంతో సంతోషంగా ఉందని చెప్పుకొచ్చారు. ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తర్వాత ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు.
గత కొంతకాలంగా అతని ఐపీఎల్ ఫ్యూచర్ పైనా వార్తలు వస్తున్నాయి. గత సీజన్ కు ముందే రిటైర్మెంట్ ఇస్తాడని వార్తలు వచ్చినా ప్లేయర్ గా అభిమానులను అలరించాడు. ఇప్పుడు మెగా వేలం ముంగిట మరోసారి ధోనీ ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి.

ధోనీని రిటైన్ చేసుకునేందుకే చెన్నై సూపర్ కింగ్స్ అన్ క్యాప్డ్ రూల్ ను వేలంలోకి తీసుకొచ్చిందన్న వాదనా ఉంది. ఒకవేళ ధోనీ ఆటగాడిగా రిటైరయినా కూడా చెన్నై సూపర్ కింగ్స్ మెంటార్ రోల్ లో కనిపించే అవకాశాలున్నాయి. అదే సమయంలో టీ10 లీగ్ షార్ట్ ఫార్మాట్ కావడంతో ఆడేందుకు నిర్వాహకులు ప్రయత్నాలు చేస్తున్నారు. మోకాలికి సర్జరీ తర్వాత ధోనీ ఫిట్ నెస్ సాధించడంపై ఫోకస్ పెట్టగా… ఐపీఎల్ వేలం తర్వాత క్లారిటీ వచ్చే అవకాశముంది. అయితే ఈ ఏడాది అబుదాబీ టీ10 లీగ్ లో ధోనీ ఆడకున్నా భవిష్యత్తులో కనిపించే అవకాశాలను కొట్టిపారేయలేం. ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికీ తిరుగులేని క్రేజ్ ఉన్న ఈ భారత మాజీ కెప్టెన్ ఆ లీగ్ లో ఆడితే ఫ్యాన్స్ కు అంతకుమించిన ఎంటర్ టైన్ మెంట్ ఏముంటుంది.