రాష్ట్రాలే కాదు..కేంద్రం కూడా అప్పులు చేస్తుంది.. చేయాలి కూడా.. కానీ ఏపీ సర్కార్.. తన పరిమితికి మించి రుణాలు తీసుకుంటూ.. రాష్ట్రాన్ని దివాళా అంచున నిలబెట్టిందని జగన్ వ్యతిరేక పార్టీలు చేస్తున్న ప్రదాన ఆరోపణ. అయితే వీటన్నింటికీ చెక్ పెడుతూ.. ఏపీ అప్పులు పరిమితికి లోబడే ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. స్వయంగా ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ లోక్‌సభలో ఈ విషయాన్ని ప్రకటించారు.
నాలుగేళ్లలో ఏపీ చేసిన అప్పు ఎంతంటే..!
జగన్ ప్రభుత్వం వివిధ పథకాల పేరుతో నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి వేల కోట్ల రూపాయలను జమచేస్తోంది. జగన్ బటన్ నొక్కడం ఒకటే పనిగా పెట్టుకున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. దీని కోసం అందినకాడికల్లా అప్పులు చేస్తున్నట్టు జగన్ విపక్షాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నా.. కేంద్ర మాత్రం ఏపీ ప్రభుత్వం అప్పుల విషయంలో గీత దాటలేదని తేల్చి చెప్పింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగేళ్లలో చేసిన మొత్తం అప్పులు లక్షా 77వేల 991 కోట్ల రూపాయలు మాత్రమేనని నిర్మలాసీతారామన్ తేల్చి చెప్పారు. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్..ఎఫ్ ఆర్ బి ఎం పరిధిలోనే ఏపీ ప్రభుత్వ అప్పులు ఉన్నట్టు లోక్‌సభ దృష్టికి తీసుకువచ్చింది. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు లోబడే ఏపీ సర్కార్ అప్పులు చేస్తోందని. ఎఫ్ ఆర్ బి ఎం నిబంధనల ప్రకారం నడుస్తుందా లేదా అన్న విషయాన్ని ఏపీ ఏసెంబ్లీ పర్యవేక్షిస్తుందని చెప్పారు నిర్మల. 2019 నాటికి ఏపీ అప్పులు 2 లక్షల 64 వేల 451 కోట్ల రూపాయలు ఉంటే.. అది ప్రస్తుతానికి 4 లక్షల, 42 వేల 442 కోట్లకు చేరినట్టు కేంద్రం చెబుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ.. జీఎస్డీపీలో ఏపీ అప్పుల వాట 32.95 శాతం మాత్రమేనంటోంది కేంద్రం.
అత్యధికంగా అప్పులు చేసే రాష్ట్రాల్లో లేని ఏపీ
ఏపీ మొత్తం అప్పుల మీదే బతుకుతున్నట్టు విపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా..అధికారిక లెక్కలు చూస్తే మాత్రం అవి కేవలం ఆరోపణలని మాత్రమే అర్థమవుతుంది. దేశవ్యాప్తంగా అత్యధికంగా అప్పులు చేస్తున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్ర, తెలంగాణ ఉన్నాయని అందరూ అనుకుంటారు. కానీ వాస్తవానికి అత్యధికంగా అప్పులు చేస్తున్న రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉన్నది తమిళనాడు మాత్రమే. ఇప్పటి వరకు తమిళనాడు నెత్తిన 7.54 లక్షల కోట్ల అప్పు ఉంది. ఆ తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలున్నాయి. టాప్ 6 రాష్ట్రాల్లో కూడా ఏపీ లేకపోవడం విశేషం.
అప్పుల విషయంలో జగన్‌కు కేంద్రం అండ
లోక్‌సభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనతో ఒక విషయం క్లియర్ కట్ గా తేలిపోయింది. విపక్షాలు కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశించి మాత్రమే ఏపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేస్తోందని విమర్శలు గుప్పించినట్టు అర్థమవుతుంది. కనీసం అత్యధికంగా అప్పులు చేస్తున్న టాప్ 6 రాష్ట్రాల్లో కూడా ఏపీ లేనప్పుడు.. విపక్షాలు చేస్తున్న ఆరోపణల్లో పసలేదని అర్థమైపోతుంది. ఎన్నికల వేళ వైసీపీకి నిర్మలమ్మ కొత్త అస్త్రం అందించారనే చెప్పాలి. ఎఫ్ ఆర్ బి ఎం పరిధి దాటి అనేక రాష్ట్రాలు అప్పులు చేస్తుంటే.. కేంద్రం మందలిస్తూ వస్తోంది. కొత్త అప్పుల కోసం తెలంగాణ వంటి రాష్ట్రాలు కేంద్రం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం కూడా సంక్షేమం కోసం ఇతర నిధులను మళ్లిస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నా.. చేస్తున్న అప్పులకు విపక్షాలు చెబుతున్న లెక్కలకు పొంతనలేదని తేలిపోయింది.