చరిత్ర సృష్టించిన నితీశ్ తెలుగోడి ఆల్ రౌండ్ షో

భారత క్రికెట్ జట్టులో చోటు దక్కడం ఎంత కష్టమో దానిని నిలుపుకోవడం అంత కంటే కష్టం... వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్తా చాటితేనే జట్టులో ప్లేస్ ఉంటుంది. ఈ విషయంలో తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి కాస్త వ్యూహాత్మకంగానే ముందున్నట్టు చెప్పొచ్చు.

  • Written By:
  • Publish Date - October 10, 2024 / 03:51 PM IST

భారత క్రికెట్ జట్టులో చోటు దక్కడం ఎంత కష్టమో దానిని నిలుపుకోవడం అంత కంటే కష్టం… వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్తా చాటితేనే జట్టులో ప్లేస్ ఉంటుంది. ఈ విషయంలో తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి కాస్త వ్యూహాత్మకంగానే ముందున్నట్టు చెప్పొచ్చు. అసలే టీ ట్వంటీ జట్టులో యువ ఆటగాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. అలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ తో తొలి టీ ట్వంటీతో అరంగేట్రం చేసిన నితీశ్ కుమార్ రెడ్డి పర్వాలేదనిపించాడు. అయితే రెండో మ్యాచ్ లో కూడా గంభీర్ అతన్ని కొనసాగించాలని నిర్ణయించుకోవడం… ఈ అవకాశాన్ని నితీశ్ ఒడిసిపట్టి చక్కని ఇన్నింగ్స్ తో అదరగొట్టేశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే రెండో టీ ట్వంటీలో తెలుగోడి ఆల్ రౌండ్ షో అదిరిపోయిందని చెప్పాలి. ఈ మ్యాచ్ లో నితీశ్ ఇన్నింగ్స్ ధనాధన్ లాగే సాగింది. మొదటి 13 బంతుల్లో 13 పరుగులే చేసిన నితీశ్ తర్వాత మాత్రం రెచ్చిపోయాడు. మరో 14 బంతుల్లో 37 రన్స్ చేసి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు.

హాఫ్ సెంచరీ తర్వాత కూడా భారీ సిక్సర్లతో బంగ్లా బౌలర్లను ఆటాడుకున్నాడు. ఓవరాల్ గా 34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లతో 74 రన్స్ చేశాడు. ఈ క్రమంలో పలు అరుదైన రికార్డులు అందుకున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో 70 ప్లస్ రన్స్‌తో పాటు 2 వికెట్లు తీసిన తొలి భారత ఆల్‌‌రౌండర్‌గా చరిత్రకెక్కాడు. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించిన నితీష్ కుమార్ రెడ్డి.. బౌలింగ్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. దాంతో ఈ ఘనతను అందుకున్న తొలి భారత ఆల్‌రౌండర్‌గా నిలిచాడు. అరంగేట్రం చేసిన రెండో టీ20లోనే బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లో సత్తా చాటిన నితీష్ కుమార్ రెడ్డికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

నిజానికి భారత్ 41 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మతో పాటు సూర్యకుమార్ సైతం పవర్ ప్లేలోనే వెనుదిరిగారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన నితీశ్ రింకూతో కలిసి 108 పరుగుల భారీ భాగస్వామ్యంతో ఆదుకున్నారు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ ఆంధ్రా క్రికెటర్ గత సీజన్ లో అదరగొట్టాడు. 358 రన్స్ చేయడంతో పాటు బంతితోనూ రాణించాడు. ఇప్పుడు భారత జట్టు తరపున కూడా అరంగేట్రం చేయడంతో నితీష్ కుమార్ ను సన్ రైజర్స్ రిటైన్ చేసుకోవాలంటే 11 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే బంగ్లాతో రెండో టీ ట్వంటీలో నితీశ్ తో పాటు రింకూ సింగ్ కూడా దుమ్మురేపాడు. రింకూ 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 రన్స్ కు ఔటవగా…టీమిండియా 20 ఓవర్లలో 221 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ఆరంభం నుంచే చేతులెత్తేసిన బంగ్లాదేశ్సిం 135 పరుగులకే పరిమితమైంది.