జాతీయ జట్టుకు ఆడడం ప్రతీ యువక్రికెటర్ కల… ఆ కల నెరవేరిన క్షణం నుంచి అసలైన సవాల్ మొదలవుతుంది… టీమిండియాలోకి వచ్చేంత వరకూ ఎంత కష్టపడాలో తర్వాత జట్టులో ప్లేస్ ఉండాలంటే అంతకుమించి కష్టపడాల్సిందే… ఎందుకంటే ప్రస్తుతం భారత క్రికెట్ జట్టులో ప్రతీ ప్లేస్ కూ కనీసం నలుగురు పోటీపడుతున్నారు. ఈ పోటీని తట్టుకుని ప్లేస్ నిలుపుకోవాలంటే ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే… ఈ విషయాన్ని తక్కువ రోజుల్లోనే అర్థం చేసుకున్న తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి దుమ్ము రేపుతున్నాడు. టెస్ట్ ఫార్మాట్ లో ఎలా ఆడాలో ఆడి చూపించాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆరంభం నుంచీ బ్యాట్ తో ఆకట్టుకుంటున్న నితీశ్ రెడ్డి బాక్సింగ్ టెస్టులో మాత్రం అదరగొట్టాడు. తన మంచి ఆరంభాలను భారీ ఇన్నింగ్స్ లుగా మలచలేకపోయిన నితీశ్ ఈ మ్యాచ్ లో మాత్రం దానిని అందుకున్నాడు. అది కూడా ఐకానిక్ మెల్ బోర్న్ స్టేడియంలో దాదాపు లక్ష మంది ప్రేక్షకుల మధ్య అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆడే ఇన్నింగ్స్ కు ఉండే విలువే వేరు… ఒక్క మాటలో చెప్పాలంటే ఆ ఇన్నింగ్స్ చాలా కాలం గుర్తుండిపోతుంది.. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో అటువంటి ఇన్నింగ్సే ఆడాడు నితీశ్ రెడ్డి… టీమ్ మేనేజ్ మెంట్ తనపై ఉంచిన నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకుంటూ జట్టును ఫాలో ఆన్ గండం నుంచి గట్టెక్కించాడు. వాషింగ్టన్ సుందర్ తో కలిసి కీలక పార్టనర్ షిప్ నెలకొల్పాడు. టెస్ట్ ఫార్మాట్ లో ఆడాలంటే ఎంతో ఓపిక ఉండాలి… భారీ ఇన్నింగ్స్ ఆడాలంటే కొన్ని బంతులను వదిలేయాలి… ప్రత్యర్థి బౌలర్లు కొన్ని బాల్స్ తో రెచ్చిగొట్టినా… ట్రాప్ లో పడకుండా ఆడాల్సి ఉంటుంది.. ఈ విషయంలో నితీశ్ రెడ్డి 100కు 100 మార్కులు కొట్టేశాడు… కమ్మిన్స్, స్టార్క్ , బొలాండ్ చాలా షార్ట్ బాల్స్ , బౌన్సర్లతో ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించారు.. కొన్ని లూజ్ బాల్స్ తో టెంప్ట్ చేసేందుకు కూడా ట్రై చేశారు.. అయితే వాళ్ళ ట్రాప్ లో పడకుండా చాలా షార్ట్ బాల్స్ ను ఆడకుండా సంయమనం పాటించాడు.
ఈ మ్యాచ్ లో నితీశ్ రెడ్డి సెంచరీ కొట్టాడంటే అదే కారణం.. సహనంతో ఆడి జట్టును ఆదుకున్నాడు. అవతలి ఎండ్ లో జడేజా, తర్వాత వాషింగ్టన్ సుందర్ కూడా చక్కని సపోర్ట్ ఇచ్చారు. ఫలితంగా జట్టు స్కోరును 350 దాటించాడు. ఆసీస్ బౌలర్ల ధాటికి కీలక బ్యాటర్లంతా విఫలమైన వేళ.. అతడు మాత్రం పట్టుదలగా క్రీజులో నిలబడ్డాడు. కంగారూల పేస్‌కు తన బ్యాట్‌తో జవాబిచ్చి వారిని డిఫెన్స్ పడేశాడు. బాక్సింగ్ డే టెస్ట్‌లో నితీశ్ చేసిన సెంచరీ ఆషామాషీ సెంచరీ కాదు. ఈ సెంచరీ ప్రతి క్రికెట్ అభిమానికి గుర్తుండిపోవడం ఖాయం…ప్రతీసారీ విధ్వంసంతోనే ప్రశంసలు అందుకోలేం.. టెస్టుల్లో ఎక్కువసార్లు విలువైన ఇన్నింగ్స్ లే గుర్తుంటాయి. టీ ట్వంటీ, వన్డే తరహాలో ఆడినా ఓపిగ్గా ఇన్నింగ్స్ ఆడి టెస్టుల్లో వచ్చే కిక్కే వేరు.. జట్టును కష్టాల నుంచి గట్టెక్కించే ఇన్నింగ్స్ ఆడిన నితీశ్ కుమార్ రెడ్డిపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. అరంగేట్రం సిరీస్‌లోనే సూపర్ సెంచరీతో మెరిసిన నితీశ్ మాజీ క్రికెటర్లు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత అభిమానుల మన్ననలందుకుంటున్నాడు. నితీశ్ భారత క్రికెట్ లో ఫ్యూచర్ స్టార్ గా ఎదుగుతాడని విషెస్ చెబుతున్నారు.
మూడోరోజు ఆటముగిసిన తర్వాత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్ , మాథ్యూ హెడెన్, వివిఎస్ లక్ష్మణ్ లాంటి దిగ్గజ ఆటగాళ్ళు నితీశ్ ను ప్రశంసలతో ముంచెత్చారు. నితీశ్ సెంచరీని అద్భుతంని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభివర్ణించాడు. మెల్ బోర్న్ లాంటి స్టేడియంలో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం ఎంతో గొప్ప విషయమంటూ వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేశాడు. ఆసీస్ మాజీలు సైతం నితీశ్ బ్యాటింగ్ కు ఫిదా అయిపోయారు. ముఖ్యంగా ఫిఫ్టీ పూర్తి చేసుకున్నా పుష్ప స్టైల్ లో అతను సెలబ్రేట్ చేసుకున్న విధానం విదేశీ మాజీలను సైతం ఆకట్టుకుంది. నితీశ్ సెంచరీ సమయంలో గ్యాలరీ ఉన్న అతని తండ్రి ముత్యాలరెడ్డి ఎమోషనల్ అయ్యారు. కంగారూ గడ్డపై ఎప్పటికీ గుర్తిండిపోయే ఇన్నింగ్స్ ఆడి దేశం గర్వపడేలా చేశాడంటూ భావోద్వేగానికి గురయ్యారు. మొత్తం మీద బాక్సింగ్ డే టెస్టులో ఆసీస్ బౌలర్లను బాక్సింగ్ ఆడుకున్న నితీశ్ తెలుగోడు ఎక్కడైనా సరే తగ్గేదే లేదంటూ నిరూపించాడు.