తెలుగోడిపై గంభీర్ ఫోకస్, పెర్త్ టెస్ట్ తుది జట్టులో నితీశ్ ?

ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఇంకా మూడురోజుల టైముంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానున్ను తొలి టెస్టుతో ఐదు టెస్టుల సిరీస్ కు తెరలేవనుంది. మూడోసారి ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవాలనుకుంటున్న టీమిండియాకు కొన్ని ఊహించని చిక్కులు ఎదురయ్యాయి.

  • Written By:
  • Publish Date - November 18, 2024 / 09:42 PM IST

ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఇంకా మూడురోజుల టైముంది. నవంబర్ 22 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభం కానున్ను తొలి టెస్టుతో ఐదు టెస్టుల సిరీస్ కు తెరలేవనుంది. మూడోసారి ఆసీస్ గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవాలనుకుంటున్న టీమిండియాకు కొన్ని ఊహించని చిక్కులు ఎదురయ్యాయి. ఈ మ్యాచ్ కు పలువురు కీలక ఆటగాళ్ళు అందుబాటులో ఉండడం లేదు. రెండోసారి తండ్రయిన రోహిత్ శర్మ ప్రస్తుతం స్వదేశంలోనే ఉండగా… ప్రాక్టీస్ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ గాయపడ్డాడు. స్లిప్ లో క్యాచ్ పట్టబోయి వేలికి గాయమవడంతో తొలి టెస్టుకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. దీంతో తుది జట్టు కూర్పుపై కోచ్ గంభీర్ , కెప్టెన్ జస్ప్రీత్ బూమ్రా ఫోకస్ పెట్టారు. రోహిత్ స్థానంలో ఓపెనర్ గా కెఎల్ రాహుల్ జైశ్వాల్ తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. అయితే వన్ డౌన్ అభిమన్యు ఈశ్వరన్, పడిక్కల్ లో ఒకరికి చోటు దక్కుతుందని అంచనా వేస్తున్నారు.

కేఎల్ రాహుల్‌ , అభిమన్యు ఈశ్వరన్ ఫామ్‌లో లేకపోవడం భారత్ అభిమానులను కలవరపెడుతోంది. అయితే గౌతమ్ గంభీర్ మాత్రం తుదిజట్టుపై ఎంతో స్పష్టత ఉన్నాడని సమాచారం. రోహిత్ అందుబాటులో ఉండడని ఇప్పటికే తేలిపోవడంతో బూమ్రానే లీడ్ చేయనుండగా… మిగిలిన జట్టు కూర్పుపై గంభీర్ చాలా వరకూ నిర్ణయాలు తీసుకున్నాడని తెలుస్తోంది. యువ పేస్ ఆల్‌రౌండర్, తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డిని తుదిజట్టులోకి తీసుకురావాలని గంభీర్ ఆలోచనగా కనిపిస్తోంది. ఐపీఎల్‌తో పాటు బంగ్లాదేశ్ తో సిరీస్‌లో నితీశ్ కుమార్ రెడ్డి సత్తాచాటి అందరి దృష్టి ఆకర్షించాడు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు బదులుగా భారత్-ఏ జట్టు తరఫున ఆస్ట్రేలియా పర్యటనకు పంపారు. కానీ నితీశ్ ఆస్ట్రేలియా-ఏ జట్టుతో అంచనాలను అందుకోలేకపోయాడు. రెండు టెస్టుల్లో 71 పరుగులే చేశాడు. బౌలింగ్‌లోనూ ఒక్క వికెట్‌తోనే మెరిశాడు.

కానీ ఇంట్రా స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ లో నితీశ్ సత్తాచాటాడు. స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, రిషభ్ పంత్‌ను బంతితో ఇబ్బంది పెట్టాడు. ఈ నేపథ్యంలో భారత్-ఏ తరఫున ప్రదర్శనతో సంబంధం లేకుండా నితీశ్‌ను తొలి టెస్టు తుదిజట్టులో ఆడించాలని గంభీర్ నిర్ణయించున్నాడని సమాచారం. నితీశ్ బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. అయితే పెర్త్ పిచ్ పై ఆసీస్ బ్యాటర్లను నితీశ్ ఎంతవరకూ ఇబ్బంది పెడతాడనేది చూడాలి. కానీ ఆల్ రౌండర్ కావడంతో లోయర్ ఆర్డర్ లోనూ జట్టుకు ఉపయోగపడతాడని గంభీర్ వ్యూహంగా కనిపిస్తోంది. మిడిలార్డర్ తర్వాత లోయర్ ఆర్డర్ చేసే కొన్ని పరుగులైనా ఆసీస్ పిచ్ లపై చాలా కీలకమవుతాయి. అందుకే నితీశ్ రెడ్డి అరంగేట్రం ఖాయంగా కనిపిస్తోంది. ఇక పేసర్లకు ఫుల్ జోష్ నిచ్చేలా పెర్త్ పిచ్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.