పెర్త్ లో తెలుగోడి ఎంట్రీ, ఆకట్టుకున్న నితీశ్ రెడ్డి

టెస్ట్ ఫార్మాట్ లో ఆడడం ప్రతీ క్రికెటర్ కల... ఆ కల నెరవేరేందుకు కొందరికి చాలా సమయం పడుతుంది.. దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణించి, సెలక్టర్లను రెగ్యులర్ గా ఇంప్రెస్ చేస్తూ ఉంటేనే టెస్ట్ జట్టులోకి ఎంపికవుతుంటారు.

  • Written By:
  • Publish Date - November 22, 2024 / 01:45 PM IST

టెస్ట్ ఫార్మాట్ లో ఆడడం ప్రతీ క్రికెటర్ కల… ఆ కల నెరవేరేందుకు కొందరికి చాలా సమయం పడుతుంది.. దేశవాళీ క్రికెట్ లో నిలకడగా రాణించి, సెలక్టర్లను రెగ్యులర్ గా ఇంప్రెస్ చేస్తూ ఉంటేనే టెస్ట్ జట్టులోకి ఎంపికవుతుంటారు. టీ ట్వంటీ, వన్డే తరహా బ్యాటింగ్ టెస్టులకు పనికిరాదు. కానీ తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి మాత్రం ఐపీఎల్ ద్వారా జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. మొన్న బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్ తో అరంగేట్రం చేసిన నితీశ్ రెడ్డి చాలా త్వరగానే టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అది కూడా బౌన్సీ పిచ్ లపై అరంగేట్రం చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ లో జరుగుతున్న తొలి టెస్టుతో నితీశ్ కుమార్ రెడ్డి రెడ్ బాల్ ఫార్మాట్ లోకి అడుగుపెట్టాడు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ చేతుల మీదుగా నితీశ్ డెబ్యూ క్యాప్ అందుకున్నాడు.

నితీశ్ రెడ్డితో పాటు ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా కూడా ఈ మ్యాచ్‌తోనే టెస్టు క్రికెట్ ఆరంభించాడు. రవిచంద్రన్ అశ్విన్ హర్షిత్ రాణాకు టెస్ట్ క్యాప్ అందించాడు. కాగా
నితీశ్ రెడ్డి టెస్ట్ అరంగేట్రం నేపథ్యంలో అతని తండ్రి ముత్యాలరెడ్డి ఎమోషనల్ అయ్యారు. ఆరాధ్య క్రికెటర్ విరాట్ కోహ్లి చేతుల మీదుగా టెస్టు క్యాప్‌ను అందుకోవడం నితీశ్ కుమార్ రెడ్డి జీవితంలో అత్యుత్తమ క్షణాలని నితీశ్ తండ్రి చెప్పారు. ఈ ఏడాది నితీశ్‌కు గొప్పగా కలిసొచ్చిందని చెప్పారు. 2024 ఐపీఎల్ సీజన్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున నితీశ్ అదరగొట్టాడని, బంగ్లాదేశ్ టీ20 సిరీస్‌లో సత్తాచాటాడని గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు టెస్ట్ ఫార్మాట్ లో అడుగుపెట్టడం, అది కూడా ఆసీస్ లాంటి జట్టుపై ఎంట్రీ ఇవ్వడం గొప్ప అవకాశంగా చెప్పుకొచ్చారు.

కాగా ఈ మ్యాచ్ లో నితీశ్ కుమార్ రెడ్డి బ్యాటింగ్ లో ఆకట్టుకున్నాడు. 72 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో పంత్ తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఏడో వికెట్ కు 48 పరుగులు జోడించడంతో భారత్ గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. కాస్త దూకుడుగానే ఆడిన నితీశ్ రెడ్డి 59 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్ తో 41 పరుగులు చేసి చివరి వికెట్ గా ఔటయ్యాడు. ఆసీస్ పిచ్ లపై లోయర్ ఆర్డర్ కాసేపు బ్యాటింగ్ చేసే ఆటగాడు కావాలన్న గంభీర్ తన వ్యూహంలో భాగంగానే నితీశ్ కు అవకాశమిచ్చాడు. అలాగే బూమ్రా, సిరాజ్, హర్షిత్ రాణాలకు తోడుగా పేస్ ఎటాక్ తో రాణించే బౌలర్ గానూ నితీశ్ జట్టుకు కలిసొస్తాడని గంభీర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. బ్యాట్ తో ఆకట్టుకున్న నితీశ్ బంతితోనూ రాణించి గంభీర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడని క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు.